
హైదరాబాద్ , 09 నవంబర్ (హి.స.)
బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టుపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. నరేందర్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. పార్టీ కార్యకర్త అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్తున్న నాయకుడిని అడ్డుకుని అరెస్టు చేయడం ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనమని విమర్శించారు.
ఒక పార్టీ కార్యకర్త మృతిచెందితే కుటుంబ సభ్యులను పరామర్శించడం, అంత్యక్రియల్లో పాల్గొనడం రాజకీయ నాయకుల బాధ్యత అని కేటీఆర్ పేర్కొన్నారు. అలాంటి కార్యక్రమానికి వెళ్తున్న నరేందర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులకు స్వేచ్ఛ లేకుండా చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.
ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కేందుకు అరెస్టులు, నిర్బంధాలను ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే నాయకులను భయపెట్టడం ద్వారా ప్రతిపక్షాలను బలహీనపర్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. నిర్బంధాలే పాలనగా మారడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వ్యాఖ్యానించారు. పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్