
ఢిల్లీ, 17 ఫిబ్రవరి (హి.స.)ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలామంది ప్రముఖుల పేర్లు ఇందులో బహిర్గతమయ్యాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హయత్ హోటల్స్ఎగ్జిక్యూటివ్ చైర్మన్, బిలియనీర్ థామస్ ప్రిట్జ్కర్ పేరుకు కూడా బయటకు వచ్చింది. దీంతో ఆయన తన పదవికి, బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో తనకు ఉన్న సంబంధాలపై వస్తున్న వరుస కథనాల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
అదేవిధంగా జెఫ్రీ ఎప్‌స్టీన్ (Jeffrey Epstein) అతడి గర్ల్‌ఫ్రెండ్ గిస్లైన్ మాక్స్‌వెల్‌తో పరిచయాలు పెంచుకుని తాను తప్పు చేశానని థామస్ ప్రిట్జ్కర్ అంగీకరించారు. 2008లో జెఫ్రీ ఎప్‌స్టీన్ లైంగిక నేరస్థుడిగా నిర్ధారణ అయిన తర్వాత కూడా అతడితో ప్రిట్జ్కర్ ఈ-మెయిల్ ద్వారా సంభాషణలు జరిపినట్లుగా ఇటీవల బయటపడిన ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’లో వెల్లడైంది.
కాగా, జెఫ్రీ ఎప్‌స్టీన్ బాధితురాలైన వర్జీనియా గిఫ్రే (Virginia Giuffre) 2016లో ఇచ్చిన ఒక డిపాజిషన్‌లో ప్రిట్జ్కర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఎప్‌స్టీన్ తనను ప్రిట్జ్కర్ వద్దకు పంపించాడని ఆమె పేర్కొన్నారు. అయితే, ఈ లైంగిక వేధింపుల ఆరోపణలను ప్రిట్జ్కర్ మొదటి నుంచీ తీవ్రంగా ఖండిస్తూనే ఉన్నారు. రాజీనామా సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జెఫ్రీ ఎప్‌స్టీన్, మాక్స్‌వెల్ వల్ల బాధితులకు జరిగిన అన్యాయానికి తాను ఎంతగానో విచారిస్తున్నానని అన్నారు. వారితో సంబంధాలు కొనసాగించినందుకు ఎటువంటి సాకులు చెప్పనని పేర్కొన్నారు. హయత్ హోటల్స్ ప్రయోజనాల దృష్ట్యా తాను అన్ని బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని థామస్ ప్రిట్జ్కర్ స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV