
హైదరాబాద్, 18 ఫిబ్రవరి (హి.స.) అమెరికాలో శ్వేత జాతీయుల
హక్కుల ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన నేత రెవరెండ్ జెస్సీ జాక్సన్ మరణించారు. 84 ఏళ్ల జెస్సీ జాక్సన్ చికాగోలోని తన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారని ఆయన కుమార్తె సంతిత జాక్సన్ తెలియజేశారు. గత కొంతకాలంగా ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. జెస్సీ జాక్సన్ అమెరికాలో చాలా సంవత్సరాలు జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. ముఖ్యంగా నల్లజాతి ప్రజల హక్కుల కోసం, సమానత్వం కోసం ఆయన గొంతెత్తారు. శ్వేత జాతీయుల ఆధిపత్యం, అన్యాయం, వివక్ష వంటి విషయాలపై గట్టిగా గళం విప్పేవారు.
1941 అక్టోబర్ 8న సౌత్ కరోలినాలో జన్మించిన జెస్సీ జాక్సన్.. చిన్నప్పటి నుంచే చదువులో, క్రీడల్లో చురుకుగా ఉండేవారు. 1960లలో డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గారితో కలిసి సివిల్ రైట్స్ ఉద్యమంలో పాల్గొన్నారు. నల్లజాతి ప్రజలకు ఓటు హక్కు, సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆయన పలు ర్యాలీలు, ఉద్యమాలు చేశారు. 1968లో మార్టిన్ లూథర్ కింగ్ హత్య తర్వాత, జెస్సీ జాక్సన్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన నాయకుల్లో ముందున్నారు. 1984లో రెయిన్బో కోలిషన్ అనే సంస్థను ప్రారంభించి.. పేదలు, మైనారిటీలు, ఇతర వెనుకబడిన వర్గాల ప్రజలను ఒకటిగా చేసి వారి హక్కుల కోసం పోరాటం చేశారు. జెస్సీ జాక్సన్ 1984, 1988లో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఆయనకు భారీ మద్దతు లభించింది. ఇది అమెరికా రాజకీయాల్లో నల్లజాతి నాయకత్వానికి కొత్త దారులు వేసింది. జాక్సన్ సేవలకు గుర్తింపుగా 2000 సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం అందజేశారు.
అయితే గత కొంతకాలంగా ఆయన ప్రోగ్రెసివ్ సూప్రాన్యూక్లియర్ పాల్సీ (PSP)” అనే అరుదైన నాడీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి వల్ల నడవడం, మాట్లాడడం కష్టమై.. క్రమంగా ఆరోగ్యం పూర్తిగా క్షీణించి, మంగళవారం రాత్రి జెస్సీ జాక్సన్ మరణించారు. ఆయన మరణంపై ప్రపంచ వ్యాప్తంగా పలువురు నాయకులు సంతాపం తెలిపారు. న్యాయం కోసం పోరాడిన గొప్ప నాయకుడు అని, ఆయన మరణం ఒక పెద్ద లోటు అని, ఆయన ఆశయాలు ఎప్పటికీ ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తాయని కొనియాడారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..