
అడిలైడ్ (ఆస్ట్రేలియా), 21 ఫిబ్రవరి (హి.స.)
టీం ఇండియా ఆస్ట్రేలియా పర్యటనలో
భాగంగా ఈ రోజు మూడో టీ20 మ్యాచ్ అడిలైడ్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత మహిళల జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఈ కీలక మ్యాచ్లో ఓపెనర్లు అద్భుత ప్రదర్శన చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 175 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన కేవలం 55 బంతుల్లోనే 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 పరుగులు చేసి ఇన్నింగ్స్కు వెన్నెముకగా నిలిచింది. ఆమెకు తోడుగా జెమిమా రోడ్రిగ్స్ (46 బంతుల్లో 59 పరుగులు) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో రాణించడంతో భారత్ పటిష్ట స్థితికి చేరుకుంది. చివరిలో రిచా ఘోష్ కేవలం 7 బంతుల్లోనే 2 ఫోర్లు, ఒక సిక్సర్తో 18 (స్ట్రైక్ రేట్ 257.14) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
ఆస్ట్రేలియా బౌలర్లలో అన్నాబెల్ సదర్లాండ్ రెండు వికెట్లు తీయగా, కిమ్ గార్త్, సోఫీ మోలినెక్స్ తలో వికెట్ పడగొట్టారు. కాగా ఈ మ్యాచులో ఆస్ట్రేలియా విజయం సాధించాలంటే నిర్ణీత 20 ఓవర్లలో 177 పరుగులు చేయాల్సి ఉంది. ఈ భారీ లక్ష్యంతో బరిలోకి దిగుతున్న ఆస్ట్రేలియాను భారత బౌలర్లు ఏ మేరకు నిలువరిస్తారో చూడాలి. దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్ వంటి కీలక బౌలర్ల ప్రదర్శనపైనే ఇప్పుడు భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు