
హైదరాబాద్, 22 ఫిబ్రవరి (హి.స.)
సూపర్ 8లో భాగంగా ఇవాళ రెండు
కీలక పోరులు జరగనున్నాయి. ఇప్పటికే ఈ సూపర్ 8 లో భాగంగా జరగాల్సిన న్యూజిలాండ్, పాక్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇక ఇవాళ ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ శ్రీలంకలోని పల్లె కెలె స్టేడియం వేదికగా నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ప్రారంభం అవుతుంది. అయితే ఈ మ్యాచ్ కు కూడా వర్షం ఎఫెక్ట్ ఉంటుందని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం శ్రీలంకలోని నలుమూలల వర్షాలు పడుతున్నాయి. ఈ ఎఫెక్ట్ పల్లె కెలెలో కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే జరిగితే నేటి మ్యాచ్ కూడా రద్దు అయ్యే ప్రమాదం పొంచి ఉందని అంచనా వేస్తున్నారు క్రీడా విశ్లేషకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
మోడీ స్టేడియంలో భారత్ మ్యాచ్..
ఇక సాయంత్రం ఏడు గంటలకు భారత్, సౌత్ ఆఫ్రికా మధ్య మరో ఫైట్ ఉంటుంది. ఈ మ్యాచ్ గుజరాత్ లోని మోడీ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి వర్ష ప్రభావం లేదట. యధావిధిగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇక ఈ మ్యాచ్ నేపథ్యంలో అభిషేక్ శర్మ ఆట తీరుపైన ఫ్యాన్స్ అందరు ఆందోళన చెందుతున్నారు. నేటి మ్యాచ్ లో అందరి కన్ను అభిషేక్ పైనే ఉంది. అభిషేక్ శర్మకు ఛాన్స్ వస్తుందా? లేదా అతని స్థానంలో మరోసారి సంజు శాంసన్ స్థానం దక్కించుకుంటాడా ? అనే చర్చ మొదలైంది. నిన్న సూర్య కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు చూస్తే.. కచ్చితంగా అభిషేక్ శర్మ ఆడతాడని తెలుస్తోంది. కాగా సూపర్ 8లో ఇవాళ దక్షిణాఫ్రికా తో ఆడనున్న భారత్, ఆ తర్వాత జింబాబ్వే, వెస్టిండీస్ లతో కూడా తలపడుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు