
హైదరాబాద్, 23 ఫిబ్రవరి (హి.స.)
టీ20 ప్రపంచకప్ లో భాగంగా
ఆదివారం సాయంత్రం దక్షిణాఫ్రికాతో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా 76 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ పరాజయంతో టీ20 వరల్డ్ కప్లో భారత్ వరుసగా సాగించిన 12 మ్యాచ్ల విజయ పరంపరకు బ్రేక్ పడింది. ఈ ఓటమిపై సునీల్ గవాస్కర్ స్పందిస్తూ.. భారత బ్యాటర్లు అతివిశ్వాసంతో, గర్వంతో (ego) ఆడి వికెట్లు పారేసుకున్నారని విమర్శించారు. పిచ్ పరిస్థితులను అర్థం చేసుకోకుండా ప్రతి బంతిని బౌండరీకి పంపాలనే తాపత్రయంతో బ్యాట్ తిప్పడం వల్లనే ఈ వినాశనం జరిగిందని ఆయన మండిపడ్డారు.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ను చూసి భారత బ్యాటర్లు పాఠాలు నేర్చుకోవాల్సిందని గవాస్కర్ అన్నారు. ప్రారంభంలో మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ, డేవిడ్ మిల్లర్, బ్రెవిస్ పిచ్ స్వభావాన్ని బట్టి నెమ్మదిగా ఇన్నింగ్స్ను నిర్మించి 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారని గుర్తుచేశారు. పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయడం ఎలాగో ప్రోటీస్ ఆటగాళ్లు చూపించారని, కానీ భారత ఆటగాళ్లు మాత్రం ఎటువంటి అవగాహన లేకుండా ఆడారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
ఈ భారీ ఓటమి వల్ల భారత్ నెట్ రన్ రేట్ -3.800కు పడిపోయింది. ఇది భారత్ సెమీఫైనల్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇకపై భారత్ తన తదుపరి మ్యాచ్లలో జింబాబ్వే, వెస్టిండీస్లపై భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తదుపరి మ్యాచ్కు వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్ను జట్టులోకి తీసుకోవాలని ఈ సందర్భంగా గవాస్కర్ సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..