
ఢిల్లీ, 22 ఫిబ్రవరి (హి.స.)
2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్లో ఒక ఆసక్తికరమైన నిబంధన తెరపైకి వచ్చింది. షెడ్యూల్ ప్రకారం సూపర్-8 దశను దాటి టీమిండియా సెమీఫైనల్కు అర్హత సాధిస్తే ఆ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే, ఒకవేళ సెమీస్లో భారత్ ప్రత్యర్థిగా పాకిస్థాన్ నిలిస్తే మాత్రం ఈ లెక్కలు పూర్తిగా మారిపోతాయి. ఆ మ్యాచ్ ముంబైలో జరగదు.
భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగితే, దానిని ముంబై నుంచి శ్రీలంకలోని కొలంబోకు తరలిస్తారు. ఇరు దేశాల మధ్య 2027 వరకు అమల్లో ఉన్న 'హైబ్రిడ్ మోడల్' ఒప్పందమే ఇందుకు ప్రధాన కారణం. ఈ ఒప్పందం ప్రకారం, దాయాదుల మధ్య జరిగే మ్యాచ్లను తటస్థ వేదికలపైనే నిర్వహించాల్సి ఉంటుంది. గతంలో ఆసియా కప్ సమయంలోనూ ఇదే విధానాన్ని అనుసరించిన సంగతి తెలిసిందే.
ఒకవేళ సెమీఫైనల్లో భారత్-పాక్ తలపడితే, ఆ మ్యాచ్ మార్చి 4వ తేదీన జరుగుతుంది. విశేషమేమిటంటే, ఆ రోజు భారత్లో హోలీ పండుగ. దేశమంతా రంగుల వేడుకల్లో మునిగి తేలుతున్న సమయంలో, శ్రీలంక గడ్డపై దాయాదుల పోరు అభిమానులకు ఉత్కంఠను పంచనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV