
హైదరాబాద్, 03 ఫిబ్రవరి (హి.స.)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్
ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య సోమవారం కీలకమైన ఫోన్ సంభాషణ జరిగింది. ఈ విషయాన్ని అమెరికా రాయబారి సెర్గియో గోర్ తన అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో వెల్లడించారు. అయితే, ఇరువురు నేతలు ఏయే అంశాలపై చర్చించారనే వివరాలను ఆయన గోప్యంగా ఉంచుతూ, 'వేచి చూడండి (Stay tuned...)' అని పేర్కొనడం సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఫోన్ కాల్ ప్రాధాన్యత సంతరించుకుంది. భారతీయ ఉత్పత్తులపై ట్రంప్ ప్రభుత్వం విధించిన 50 శాతం సుంకాల (Tariffs) వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్య పరమైన సవాళ్లు ఎదురవుతున్న విషయం తెలిసిందే. నిన్న ప్రవేశపెట్టిన 2027 ఆర్థిక సంవత్సర యూనియన్ బడ్జెట్లో అమెరికా టారిఫ్ల ప్రభావాన్ని తట్టుకునేలా భారత్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న మరుసటి రోజే ఈ కాల్ రావడం గమనార్హం.
ఈ ఏడాదిలో వీరిద్దరి మధ్య జరిగిన మొదటి ఫోన్ కాల్ ఇదే అయినప్పటికీ, గత వేసవి నుంచి ఇప్పటివరకు సుమారు 10 సార్లు వీరిద్దరూ మాట్లాడుకోవడం విశేషం.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు