
హైదరాబాద్, 03 ఫిబ్రవరి (హి.స.)
అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారత్ అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలను భారీగా తగ్గిస్తున్నట్లుగా ప్రకటించారు. దీనిపై స్పందించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ 140 కోట్ల భారతీయుల తరపున సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'X' (ట్విట్టర్) వేదికగా ఆయనకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. 'మేకిన్ ఇండియా' ఉత్పత్తులపై ఉన్న సుంకాలను 18 శాతానికి తగ్గిస్తూ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ సుంకాలు సుమారు 25 శాతం నుంచి కొన్ని ఉత్పత్తులపై 50 శాతం వరకు ఉండగా, ఇప్పుడవి గణనీయంగా తగ్గాయి.
అయితే, ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం గురించి ప్రకటన వెలువడిన వెంటనే ప్రధాని మోడీ ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. అనంతరం ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్తో మాట్లాడటం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రపంచ శాంతిని నెలకొల్పడంలో ట్రంప్ నాయకత్వం ఎంతో కీలకమని ప్రశంసించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..