భారతీయ జనతా పార్టీ “వికసిత్ తెలంగాణ
బిజెపి సంకల్ప పత్రం 2026
Vijay Sankalp rally


హైదరాబాద్, 06 ఫిబ్రవరి (హి.స.)06-02-2026

హైదరాబాద్.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. పురపోరులో మున్సిపాలిటీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచేలా ప్రచారం ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ “వికసిత్ తెలంగాణ - బిజెపి సంకల్ప పత్రం 2026” పేరుతో రూపొందించిన మేనిఫెస్టోను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆవిష్కరించారు. మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు కీలక హామీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. బీజేపి మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల సహ ఇంచార్జులు అశోక్ పర్ణామి గారు, రేఖా శర్మ గారు, బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి. సుభాష్ గారు, పార్టీ సీనియర్ నాయకులు జి. వెంకట్ రెడ్డి గారు, కప్పర ప్రసాద్ గారు, సి.హెచ్. విఠల్ గారు, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

వికసిత్ తెలంగాణ మేనిఫెస్టోలో, తెలంగాణ మున్సిపాలిటీల్లో బీజేపి గెలిచిన వెంటనే అమలు చేయాల్సిన కీలక హామీలు స్పష్టంగా పొందుపరిచారు. అవినీతి రహిత పాలన, ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే నిధులను పూర్తిస్థాయిలో ప్రజల అభివృద్ధికే వినియోగించడం, ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరేలా సమర్థవంతమైన పాలనా వ్యవస్థను అమలు చేయడం ఈ మేనిఫెస్టో ప్రధాన లక్ష్యమని రాంచందర్ రావు గారు తెలిపారు.

మున్సిపాలిటీలలో ఎలాంటి అవినీతికి తావుండదని, ప్రభుత్వ లేదా మున్సిపల్ భూముల ఆక్రమణలు, నిధుల మళ్లింపుకు (డైవర్షన్) ఎటువంటి అవకాశం ఉండదని స్పష్టంగా చెప్పారు. పార్టీకి చెందినవారు గానీ, అధికారులు గానీ నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మేనిఫెస్టోలో యువత కేంద్రంగా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు, జాబ్ ట్రైనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. అలాగే ప్రతి మున్సిపాలిటీని మోడల్ నగరంగా అభివృద్ధి చేయడానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తామని రాంచందర్ రావు గారు వెల్లడించారు.

సీనియర్ సిటిజన్స్, యువతకు అనుకూలంగా ప్రతి మున్సిపాలిటీలో వాకింగ్ ట్రాక్స్, ఆధునిక సదుపాయాలతో కూడిన పార్కులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న కొన్ని పార్కులను యూటిలిటీ పార్కులుగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

మున్సిపాలిటీలలో LED వీధి దీపాలు, చెత్త, వ్యర్థాల సేకరణ, వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని తెలిపారు. ఇవి సమగ్ర, పారదర్శక నగరాల రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో నీటి సరఫరా, డ్రైనేజీ, రోడ్లు, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు వంటి అన్ని సౌకర్యాలను అత్యున్నత ప్రమాణాలతో అందించడమే ప్రధానంగా తీసుకుంటామని చెప్పారు.

ప్రభుత్వ భూములు, మున్సిపల్ భూములపై ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్స్ కు అవకాశముంటే అడ్డుకుంటామని, కబ్జాలకు పాల్పడితే వాళ్లెవరైనా సరే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. ఫైనాన్స్ కమిషన్ ద్వారా అర్బన్ లోకల్ బాడీస్‌కు వచ్చే నిధులను పూర్తిగా, పారదర్శకంగా వినియోగిస్తామని, ఎలాంటి డైవర్షన్ ఉండదని చెప్పారు. బీజేపీ పాలనలో కరప్షన్ ఫ్రీ మున్సిపల్ గవర్నెన్స్ ఉంటుందని రాంచందర్ రావు గారు స్పష్టంగా పేర్కొన్నారు.

ఈ మేనిఫెస్టో ద్వారా తెలంగాణ ప్రజలకు బీజేపీ స్పష్టమైన సంకేతం ఇస్తోందని, ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని రాంచందర్ రావు గారు పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీజేపీపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి, పార్టీ ఎదుగుదలను చూసి భయపడుతున్నాయని రాంచందర్ రావు గారు విమర్శించారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ నిధులను ప్రజలకు ఇవ్వకుండా, ప్రాజెక్టులు-కాంట్రాక్టుల ద్వారా కిక్‌బ్యాక్‌లకు ఉపయోగించుకున్నాయని విమర్శించారు.

ఇటీవలి రోజుల్లో తెలంగాణలో పోలీసు వ్యవస్థను ఉపయోగించి బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు, దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రామగుండంలో అభ్యర్థిని బెదిరించి విత్‌డ్రా చేయించిన ఘటన, మంచిర్యాలలో కార్యకర్తల ఇళ్లపై దాడులు జరిగిన విషయాలను ప్రస్తావించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను తమ కార్యకర్తల మాదిరిగా ఉపయోగించుకుంటోందని రాంచందర్ రావు మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడం, దాడులకు పాల్పడిన ఘటనలపై హ్యూమన్ రైట్స్ కమిషన్‌లో ఫిర్యాదు చేస్తామని, కేంద్ర ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

కర్ణాటకలో తీసుకొచ్చిన హేట్ స్పీచ్ బిల్లును అనుకరిస్తూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టం బీజేపీ నేతలు, కార్యకర్తలను ఇరికించేందుకు, అక్రమంగా కేసులు బనాయించేందుకు మాత్రమే ఉద్దేశించినదని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఎదుర్కొన్న సమస్యలపై ప్రస్తావిస్తూ, అవినీతి, నిధుల దుర్వినియోగంతో రాష్ట్ర అభివృద్ధి కుటుపడిందని ఆయన పేర్కొన్నారు.

మేనిఫెస్టోలో సంపూర్ణ హామీలు, మౌలిక సదుపాయాలు, ఉపాధి, విద్య, వైద్య సేవలు, పారిశుధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, డిజిటల్ సేవలు వంటి అన్ని అంశాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ గెలిస్తే అవినీతి రహిత, సమగ్ర అభివృద్ధి దిశగా మున్సిపాలిటీల మార్గం సిద్ధం అవుతుందని వివరించారు.

ఈ మేనిఫెస్టో కేవలం ఒక పత్రం కాదు. తెలంగాణ నగరాలు, పట్టణాలు ప్రపంచ స్థాయి ప్రమాణాలు నెలకొల్పే కార్యాచరణ ప్రణాళిక. పౌర సదుపాయాలు, మౌలిక వసతులు, ఉపాధి, విద్య, వైద్య సౌకర్యాలు అత్యున్నతంగా ఉంటే ప్రజల జీవనం సులభతరంగా ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్, అమృత్, హృదయ్, డిజిటల్ ఇండియా వంటి పథకాలకు శ్రీకారం చుట్టింది. ఈ పథకాలు సక్రమంగా అమలు కావాలన్నా, మరిన్ని నిధులు నగరాలకు, పట్టణాలకు రావాలన్నా స్థానికంగా బీజేపీ పాలన అవసరం. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే అవినీతిని అంతం చేసి, సమగ్ర అభివృద్ధి దిశగా పట్టణాలను ముందుకు తీసుకెళ్తామని, అందుకోసం.. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కమలం గుర్తుపై ఓటు వేసి బిజెపి అభ్యర్థులను గెలిపించాలని, నగరాలు, పట్టణాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు మద్దతు తెలిపాలని రాంచందర్ రావు పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande