
హైదరాబాద్/,ముంబయి ఫిబ్రవరి (హి.స.): డిజిటల్ మోసాల బారినపడే బాధితులకు ఊరట కలిగించేలా ఆర్‌బీఐ ఓ ప్రకటన చేసింది. చిన్న మొత్తంలో ఉన్న మోసపూరిత లావాదేవీల్లో కస్టమర్లకు జరిగిన నష్టానికి గానూ రూ.25వేలు వరకు పరిహారం ఇచ్చేలా ఓ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించింది. ఈ మేరకు ఆర్‌బీఐ (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు.
‘‘డిజిటల్ చెల్లింపుల భద్రతను పెంచడంపై మేం చర్చలు జరుపుతున్నాం. వినియోగదారుల రక్షణ నిమిత్తం మూడు ముసాయిదా మార్గదర్శకాలను రూపొందించాం. బ్యాంకుల్లో అనైతిక విక్రయాలను (మిస్‌సెల్లింగ్) అరికట్టడం, రుణాల రికవరీ - రికవరీ ఏజెంట్ల ప్రవర్తన, అనధికార డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీలలో వినియోగదారుల బాధ్యతను పరిమితం చేయడంపై ఈ మార్గదర్శకాలు ఉంటాయి. ఇక, చిన్న మొత్తంలో మోసపూరిత లావాదేవీలు జరిగిన కేసుల్లో బాధిత కస్టమర్లకు రూ.25వేలు వరకు పరిహారం ఇచ్చేలా ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకొచ్చేలా ప్రతిపాదనలు చేశాం’’ అని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వివరించారు. ఇందుకు సంబంధించి ప్రజల అభిప్రాయాలను స్వీకరించేందుకు ఆ మార్గదర్శకాలను, ఫ్రేమ్‌వర్క్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు