కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లు.. ఫిబ్రవరి 20 నుంచి 'ఆర్టీఈ' దరఖాస్తుల స్వీకరణ
అమరావతి, 06 ఫిబ్రవరి (హి.స.) రాష్ట్రంలోని వివిధ పాఠశాలలో ఉచితంగా సీట్లను పొందాలనుకునే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో నాణ్యమైన విద్యను
free-seats-in-corporate-and-private-schools-rte-applications-


అమరావతి, 06 ఫిబ్రవరి (హి.స.)

రాష్ట్రంలోని వివిధ పాఠశాలలో ఉచితంగా సీట్లను పొందాలనుకునే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో 'విద్యా హక్కు చట్టం' (RTE) కింద ఉచిత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రైవేటు పాఠశాలల్లో కేటాయించిన 25 శాతం ఉచిత కోటా సీట్ల భర్తీకి సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు పూర్తి షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేశారు.

ఈ పథకం ద్వారా ఒకటో తరగతిలో చేరాలనుకునే అర్హులైన విద్యార్థులు ఈ నెల 20వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రవేశాల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర సిలబస్‌ను అనుసరించే పాఠశాలల్లో చేరాలనుకునే పిల్లలు తప్పనిసరిగా 2020 జూన్ 2 నుంచి 2021 మే 31 మధ్య జన్మించి ఉండాలని అధికారులు వయోపరిమితిని పెట్టారు. అలాగే ఈ ఉచిత సీట్ల కోసం దరఖాస్తు చేయాలనుకునే తల్లిదండ్రులకు ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం బహుళ మార్గాలను అందుబాటులోకి తెచ్చింది.

ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా cse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా గానీ, సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాలు, మండల విద్యావనరుల కేంద్రాలు (MRC), సంబంధిత ప్రైవేటు పాఠశాలల నుంచి కూడా దరఖాస్తులను అందజేయవచ్చని తెలిపింది. ఫిబ్రవరి 7 నుంచి 16వ తేదీ వరకు ప్రైవేటు పాఠశాలలు తమ వద్ద ఉన్న ఖాళీ సీట్ల వివరాలను వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అనంతరం ఫిబ్రవరి 20 నుంచి మార్చి 10వ తేదీ వరకు విద్యార్థుల ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తారు. మార్చి 17న సచివాలయాల వద్ద ఉన్న డేటా ఆధారంగా విద్యార్థుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను విశ్లేషించి వారి అర్హతను అధికారికంగా నిర్ధారిస్తారు.

మొత్తం రెండు విడతల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి విడత సీట్ల కేటాయింపు మార్చి 25న జరుగుతుంది. దీనికి సంబంధించిన ప్రవేశాల ధ్రువీకరణ మార్చి 26 నుంచి ఏప్రిల్ 7 వరకు ఉంటుంది. ఏప్రిల్ 12న నిర్వహించి, ఏప్రిల్ 13 నుంచి 23వ తేదీ లోపు తుది ప్రవేశాలను ఖరారు చేస్తారు. ఈ ఉచిత ప్రవేశాల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు, సందేహాలు ఉన్నా తల్లిదండ్రులు నేరుగా ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా 1800-425-8599 అనే టోల్ ఫ్రీ నెంబర్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఈ అవకాశాన్ని అర్హులైన పేద విద్యార్థులందరూ వినియోగించుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande