
కామారెడ్డి, 07 ఫిబ్రవరి (హి.స.)
మునిసిపల్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థులు పూర్తిగా ప్రజా క్షేత్రంలోనే గడుపుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలను కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ మద్దతుదారుల తరుపున ప్రచారాలను ముమ్మరం చేశాయి. జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులు నిత్యం ప్రజల మధ్యనే గడుపుతూ వారి మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ తమను గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారో ఓటర్లకు వివరిస్తున్నారు. మైకులతో ప్రచారం నిర్వహించేందుకు అభ్యర్థులు ప్రత్యేక ఏర్పాట్లను చేసుకుంటున్నారు. వార్డుల్లో మందీమార్బలంతో నాయకులు, కార్య కర్తలు ఒక్కో ప్రాంతాన్ని ఎంచుకుంటూ ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు వారి కుటుంబాల సమేతంగా పాల్గొంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇంటిల్లిపాది తలో దారిలో ఇంటింటికి వెళుతూ ఓటర్లతో మిలాఖత్ అవుతున్నారు. స్థానిక సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండి, అభివృద్ధి చేయాలనే సంకల్పం ఉన్న వారికే ప్రాధాన్యం ఇచ్చేందుకు ఓటర్లు సిద్ధపడుతున్నారు.
కామారెడ్డి జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు, బరిలో ఉన్న అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈనెల 11న మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా 9న సాయంత్రం 5 గంటలతో ప్రచార పర్వం ముగియనుంది. ప్రచారానికి ఇంకా నాలుగు రోజులే గడువు ఉండడంతో అభ్యర్థులు, ఆయా పార్టీల ముఖ్యనేతలు ప్రతీరోజు కార్నర్ మీటింగ్ లతో పాటు వార్డుల్లోనూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ విధానాలు, ఎన్నికల గుర్తులు తెలుపుతూ ఆయా వార్డుల్లో చేపట్టబోయే పనులపై హామీలు ఇస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. వార్డుల్లో పోటీపడుతున్న అభ్యర్థులు ప్రత్యర్థుల బలాలు, బలహీనతలను పరిగణనలోకి తీసుకొని పార్టీల నేతలు, అభ్యర్థులు ముందుకు పోతున్నారు. ఇందులో భాగంగానే ఉదయం నుంచి రాత్రి వరకు పట్టణాల్లో అభ్యర్థులు తమ ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు