సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న పునరాభివృద్ధి పనులను సమగ్రంగా తనిఖీ
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న పునరాభివృద్ధి పనులను సమగ్రంగా తనిఖీ


హైదరాబాద్, 07 ఫిబ్రవరి (హి.స.)దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈరోజు, అనగా 7 ఫిబ్రవరి, 2026న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న పునరాభివృద్ధి పనులను సమగ్రంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ సందర్భంగా ఆయనతో పాటు దక్షిణ మధ్య రైల్వే సిఏఓ/కన్‌స్ట్రక్షన్ శ్రీ ఎం. రణధీర్ రెడ్డి, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ గోపాలకృష్ణన్ ఆర్ మరియు ఇతర సీనియర్ రైల్వే అధికారులు ఉన్నారు.

జనరల్ మేనేజర్ స్టేషన్‌లో జరుగుతున్న పునరాభివృద్ధి పనులను వివరంగా సమీక్షించారు. రైల్వే స్టేషన్ కు రెండు వైపులా, అనగా ప్లాట్‌ఫామ్ నెం. 1 మరియు ప్లాట్‌ఫామ్ నెం. 10 వైపున జరుగుతున్న పునరాభివృద్ధి పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాళ్లు, ప్లాట్‌ఫామ్‌ల పనుల పురోగతిని ఆయన తనిఖీ చేశారు. తరువాత నిర్మాణం చేయబోయే బుకింగ్ ఆఫీస్, పార్కింగ్ మరియు స్టేషన్ ప్రాంగణంనకు సంబంధించిన పనులను కూడా ఆయన పరిశీలించారు.

జనరల్ మేనేజర్‌కు పునరాభివృద్ధి పనులకు సంబంధించిన ప్రణాళికలు మరియు పురోగతిలో ఉన్న పనులను గురించి అధికారులు వివరించారు. ప్రాజెక్టును మరియు ప్రయాణీకుల సౌకర్యాలను సకాలంలో పూర్తి చేయడానికి పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. భద్రత మరియు రక్షణను పాటిస్తూనే ప్రయాణీకుల సులభమైన రాకపోకలను కల్పించడానికి తీసుకున్న సమగ్ర చర్యల గురించి కూడా సికింద్రాబాద్ డివిజన్ అధికారులు వివరించారు.

శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ప్రధాన మౌలిక సదుపాయాల మార్పులతో కూడిన పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్న సమయంలో, సమర్థవంతమైన జనసమూహ నిర్వహణ, మెరుగైన భద్రతా చర్యలు మరియు పటిష్టమైన ప్రయాణీకుల సహాయ యంత్రాంగాలను అమలు చేయడం ద్వారా ప్రయాణీకులకు కలిగే అసౌకర్యాన్ని కనిష్ట స్థాయికి తగ్గించాలని అధికారులను ఆదేశించారు .

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande