
వరంగల్, 07 ఫిబ్రవరి (హి.స.)
వరంగల్ ఉమ్మడి జిల్లాలో ధాన్యం ఎగ్గొట్టిన 120 డిఫాల్ట్ రైస్ మిల్లులపై పౌరసరఫరాల శాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. 2022-23 సంవత్సరానికి సంబంధించి కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని అందించని మిల్లులపై క్రిమినల్ మరియు ఆర్ ఆర్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, వారి ఆస్తుల స్వాధీనానికి రంగం సిద్ధం చేశారు. హన్మకొండలో 37, వరంగల్లో 30, భూపాలపల్లిలో 20 మిల్లులతో పాటు ఇతర జిల్లాల్లోని డిఫాల్ట్ మిల్లుల్లో విజిలేన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి అక్రమాలను గుర్తించారు. ఈ మిల్లుల ఆస్తులను అమ్మకుండా లేదా బదలాయింపులు చేయకుండా సబ్ రిజిస్ట్రార్లకు కలెక్టర్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
పౌరసరఫరాల సంస్థ ద్వారా సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యం అందించడంలో విఫలమైన డిఫాల్ట్ రైస్ మిల్లుల (Default rice mills)పై యంత్రాంగం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసినప్పటికీ ధాన్యం నిల్వలు చూపని, బియ్యం అం
నిబంధనల ఉల్లంఘన..వేలానికి సిద్ధం..
2022-23 సంవత్సరంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిర్ణీత సమయంలో కస్టం మిల్లింగ్ (Custom milling) కింద బియ్యంగా అందించాలని ప్రభుత్వం మిల్లర్లను ఆదేశించింది. అయితే, పలు మిల్లులు బియ్యాన్ని అందించకపోగా, ప్రభుత్వం ధాన్యాన్ని వేలం వేసినా సహకరించలేదు. ఈ నేపథ్యంలో స్పందించని మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు రంగంలోకి దిగారు. ధాన్యం నిల్వలు మాయం చేసిన మిల్లుల ఆస్తులను వేలం వేసి ప్రభుత్వ సొమ్మును రికవరీ చేయాలని నిర్ణయించారు.
ఉమ్మడి జిల్లాలో 120 డిఫాల్ట్ మిల్లులు..
వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 120 మిల్లులు డిఫాల్ట్ జాబితాలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో వరంగల్ జిల్లాలో 30, హన్మకొండలో 37, భూపాలపల్లిలో 20 మిల్లు లతోపాటు జనగామ, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో మరికొన్ని మిల్లులు ఉన్నాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో మిల్లుల్లో ఉండాల్సిన ధాన్యం నిల్వలు లేవని తేలింది. ఈ నివేదికల ఆధారంగా కలెక్టర్లు మిల్లుల, ఆస్తుల లావాదేవీలను నిలిపివేయాలని సబ్ రిజిస్ట్రార్లను ఆదేశించారు.
ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధం కావడంతో రైస్ మిల్లుల అసోసియేషన్ ప్రతినిధులు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల ద్వారా ఒత్తిళ్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ప్రభుత్వ ఆదేశాల మేరకు రికవరీ ప్రక్రియను పూర్తి చేసి తీరుతామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఏళ్ల తరబడి ధాన్యం నిల్వలపై సాగుతున్న ఈ వివాదానికి మిల్లుల ఆస్తుల వేలంతో ముగింపు పలకాలని యంత్రాంగం భావిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు