
అమరావతి, 10 మార్చి (హి.స.): గోరంట్ల తాగునీటి పథకానికి ఎలాంటి నీటి ఇబ్బంది లేకుండా కృష్ణా నది నుంచి నేరుగా మరో పైపులైను నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఇందుకోసం రూ.244 కోట్ల అంచనా వ్యయంతో ఉండవల్లి సమీపంలోని కరకట్ట నుంచి 30 కిలోమీటర్ల మేర పైపులైను నిర్మించనున్నారు. టెండర్ల ప్రక్రియపై ప్రజారోగ్యశాఖ సాంకేతిక విభాగం దృష్టి సారించింది. గోరంట్ల కొండ దిగువన ఉన్న 16.93 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆరెకరాల్లో నీటిశుద్ధి ప్లాంటు నిర్మిస్తారు. రోజుకు 85 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో (ఎంఎల్డీ) నిర్మించనున్న ఈ కేంద్రంలో క్లారిఫైయర్స్, ఫిల్టర్ బెడ్స్, కెమికల్ హౌస్... ఇలా అనేకం ఏర్పాటు కానున్నాయి. ఇక్కడ మొత్తం 115 ఎంఎల్డీ సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం కాగా.. మిగిలిన 30 ఎంఎల్డీ కేంద్రాలను వచ్చే ఏడెనిమిదేళ్లలో నిర్మించే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కొండ దిగువన నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటుకు అవసరమైన స్థలంపై అధ్యయనం జరుగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ