
అరసవల్లి , 10 మార్చి (హి.స.)
అరసవల్లి సూర్యనారాయణస్వామివారిని సూర్యకిరణాలు తాకే దృశ్యాన్ని చూసేందుకు వచ్చిన భక్తులకు రెండోరోజూ నిరాశే ఎదురైంది. ఆకాశం మేఘావృతమై ఉండటంతో నిన్న (మార్చి 9) స్వామివారిపై సూర్యకిరణాలు పడలేదు. నేడైనా ఆ అదృశం కనువిందు చేస్తుందని ఆసక్తిగా ఉన్న భక్తులు నిరాశ చెందారు. మంగళవారం కూడా మంచు, ఆకాశం మేఘావృతమై ఉండటంతో అరుదైన దృశ్యం చూసే వీలు లేకపోయింది. ప్రతీ ఏటా ఉత్తరాయణం, దక్షిణాయనం మార్పుల్లో సూర్యనారాయణస్వామివారిని సూర్యకిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తోంది. సూర్యకిరణాలు ఆలయ గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టును తాకుతాయి. ప్రతీ ఏటా మార్చి 9,10.. మళ్లీ అక్టోబర్ 1,2 తేదీల్లో స్వామివారిపై సూర్యకిరణాలు పడుతాయి. ఈ అబ్బుర దృశ్యాన్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు.. పొరుగున ఉన్న ఒడిశా నుంచి కూడా వందలాది భక్తులు ఆలయానికి వస్తుంటారు. నిన్న, ఈరోజు సూర్యకిరణాలు తాకే దృశ్యం కనిపించకపోవడంతో.. మళ్లీ అక్టోబర్ 1,2 తేదీల వరకూ వేచి ఉండాల్సిందే. నిర్ణీత సమయంలో కనిపించే ఈ అద్భుతమైన దృశ్యాన్ని కనులారా దర్శిస్తే.. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV