
డోన్, 10 మార్చి (హి.స.)కార్యకర్తలే పార్టీకి వెన్నెముక.. వారి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. కష్టపడి పని చేసిన వారికే నామినేటెడ్ పోస్టులు వరిస్తాయన్నారు. కార్యకర్తలకు అన్నివేళలా అండగా ఉంటామన్నారు. కార్యకర్తలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా చూస్తామన్నారు. డోన్ మండలం కొత్తబురుజు సమీపంలో సోమవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. నేటి కార్యకర్తలే రేపటి ఎమ్మెల్యేలు, ఎంపీలు.. వారు లేకపోతే పార్టీ లేదు.. పార్టీకి కార్యకర్తే అధినేత అని.. వారి ఆమోదంతోనే నేడు వేదికపై కూర్చొన్నారని గుర్తు చేశారు.
కార్యకర్తలు కలిసికట్టుగా పని చేసి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలతో మమేకమవుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. డోన్ నియోజకవర్గంలో ఓటింగ్ శాతం పెరగలేదు.. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఓటింగ్ శాతాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీసీలకు పార్టీ పెద్దపీట వేస్తోంది.. వారే ఆయువుపట్టు అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రజలకు తెలియజేసి రానున్న ఎన్నికల్లో పార్టీ విజయం సాధించేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత వైకాపా హయాంలో ఉమ్మడి జిల్లాలో భయంకరమైన పరిస్థితులు ఉండేవి.. తెదేపా కార్యకర్తలను బయటకు రానీయకుండా చేశారు.. నంద్యాల జిల్లాలో నన్ను అరెస్టు చేసి తీసుకెళ్లే పరిస్థితికి వచ్చారంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నామో అంటూ గుర్తు చేశారు. దాన్ని ప్రజలు గమనించి గుణపాఠం చెప్పారన్నారు.
కార్యకర్తలతో పాటు బూత్ కమిటీలు, యూనిట్ క్లస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి ప్రజలతో మమేకమవుతూ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులపై చైతన్యం తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల అభివృద్ధి పనులపై సర్వే చేయిస్తున్నామన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజలతో మమేకం కాకపోతే మార్చేస్తాఠమన్నారు. కేంద్రంలో మోదీ మూడోసారి ముచ్చటగా గెలుపొంది ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు.. నాలుగో సారి కూడా తనే ప్రధాని అవుతారన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయశాఖ మంత్రి ఫరూఖ్, నంద్యాల జిల్లా తెదేపా అధ్యక్షురాలు గౌరు చరిత, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య తదితరులు పాల్గొన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ