
అమరావతి, 10 మార్చి (హి.స.)
కూటమి ప్రభుత్వ పార్టీల్లో ఒకటైన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారు. మార్చి 14వ తేదీకి జనసేన పార్టీ ఆవిర్భావమై 12 వసంతాలు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రస్థాయిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై పవన్ కల్యాణ్ ఆంక్షలు విధించారు. ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్ర స్థాయి వేడుకలను రద్దు చేశారు. ఉమ్మడి జిల్లా కేంద్రాలు, నగరాలు, మండలాలు, పంచాయతీల్లో వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. ఎక్కడికక్కడే వేడుకలు జరుపుకునేలా చూడాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. ఈ మేరకు జనసేన పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
తొలుత పిఠాపురంలో రాష్ట్రస్థాయి వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయని రిపోర్టులు చెప్పడంతో.. వేడుకల నిర్వహణను మార్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని జిల్లా, సిటీ, మండల కేంద్రాల్లో నిర్వహించుకోవాలని పవన్ సూచించారు. స్థానికంగానే వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవాలని ఆయన పిలుపునిచత్చారు. వేడుకల్లో భాగంగా పార్టీ జెండాను జన సైనికులు, వీర మహిళలు, నాయకులు, ఉద్యమి సభ్యత్వం పొందినవారి సమక్షంలో ఎగురవేస్తారని తెలిపారు. సైద్ధాంతిక బలంతో రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి జనసేన పార్టీ ఏ విధంగా ముందుకు సాగుతుంతో పార్టీ శ్రేణులకు, ప్రజలకు వివరించాలని పవన్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV