
ములుగు, 12 మార్చి (హి.స.)
గ్రామాల్లోని సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు గ్రామ ప్రజలను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తూ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని మంత్రి సీతక్క అన్నారు. గురువారం ములుగు మండలం ఇంచర్ల గ్రామంలోని ఎం.ఆర్.ఫంక్షన్ హాల్లో జిల్లా స్థాయిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నూతనంగా ఎన్నికైన ములుగు జిల్లాలోని గ్రామ సర్పంచులకు, మున్సిపల్ కౌన్సిలర్లకు పలు శాఖల పై శిక్షణ తరగతులు నిర్వహించారు. మహిళా, శిశు సంక్షేమం, వైద్యం పై శిక్షణ కార్యక్రమాన్ని ఉదయం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. దేశంలోనే ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి ప్రతి సర్పంచ్ కృషి చేయాలని తెలిపారు. దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలని, గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రతి సర్పంచ్ తమ గ్రామాన్ని సొంత ఇంటిలా భావించుకోవాలి. ప్రజా ప్రతినిధులు స్వార్థం కోసం పని చేయకుండా ప్రజా సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ప్రతి ప్రజా ప్రతినిధి ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని, పూర్తిస్థాయిలో సేవలు అందించినప్పుడే ప్రజల గుర్తింపు లభిస్తుందని అన్నారు. గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 6 వందల కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు కేటాయించిందని, మరో 12 వందల కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నాయని ఆ నిధులను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు