
హైదరాబాద్, 13 మార్చి (హి.స.)హైదరాబాద్ వాసులకు దక్షిణ మధ్య రైల్వే ఒక తీపి కబురు అందించింది. అస్సాం రాజధాని గౌహతి సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్య నుంచి హైదరాబాద్‌లోని చర్లపల్లి టెర్మినల్ వరకు సరికొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు అందుబాటులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాంలో ఈ రైలును ప్రారంభించారు.
సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు అభివృద్ధి చేసిన చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్‌కు ఈ రైలు రావడం విశేషం. వందే భారత్ రైళ్ల తరహాలోనే అత్యాధునిక సాంకేతికతతో.. తక్కువ ఖర్చుతో సామాన్యుల కోసం రూపొందించిన రైలే ఈ ‘అమృత్ భారత్’. ఈ రైలుకు రెండు వైపులా ఇంజన్లు ఉంటాయి. దీనివల్ల వేగం పుంజుకోవడం సులభం అవుతుంది.. ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది.
ఇందులో కేవలం స్లీపర్ (Sleeper), జనరల్ సెకండ్ క్లాస్ (General) కోచ్‌లు మాత్రమే ఉంటాయి. తక్కువ ధరలో సుదూర ప్రయాణం చేసే వారికి ఇది వరం అని చెప్పవచ్చు. సెన్సార్ వాటర్ ట్యాప్స్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, మెరుగైన సీటింగ్, వెలుతురు వంటి ఆధునిక వసతులు ఇందులో ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు