ఎల్డీఎఫ్, యూడీఎఫ్ దోపిడీ నుంచి మార్పును కోరుతున్న ప్రజలు: మోదీ
కేరళలో కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీల మధ్య సంబంధాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు. రెండు పార్టీలు పరస్పర ప్రత్యర్థులుగా కనిపిస్తూ, వంతులవారిగా రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాయని విమర్శించారు.
Modi


పాలక్కాడ్, 29 మార్చి (హి.స.)కేరళలో కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీల మధ్య సంబంధాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రశ్నించారు. రెండు పార్టీలు పరస్పర ప్రత్యర్థులుగా కనిపిస్తూ, వంతులవారిగా రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో ప్రతిసారి ఎవరికి ఎవరు 'బీ' టీమ్ అనే ప్రశ్న తలెత్తుతుందని, 'ఇండియా' కూటమిలో కాంగ్రెస్-లెఫ్ట్ కలిసి ఉన్నాయని, గతంలో కలిసే ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని గుర్తుచేశారు. తమిళనాడులో కూడా రెండు పార్టీల కూటమి ఉందన్నారు. కేరళలో మాత్రం రెండు పార్టీల మధ్య శత్రుత్వం అనేది ఒక డ్రామా మాత్రమేనని వివరించారు. ప్రజలు కేరళలో మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. పాలక్కాడ్లో ఆదివారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు.

కేరళ ప్రభుత్వ రుణభారం రూ.5 లక్షల కోట్లకు పైగా ఉందని, ఈ రుణభారం రెండేళ్లలో మూడింతలైందని మోదీ తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సొమ్ము ప్రజలకే చేరుతోందని, కేరళం అభివృద్ధికి ఖర్చు చేస్తున్నామని చెప్పారు. వికసిత కేరళం తమతోనే సాధ్యమని చెప్పారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ధ్వంసం చేసిందని, ఉద్యోగులకు వేతనాలు ఇచ్చుకునే పరిస్థితి కూడా లేదని అన్నారు. దశాబ్దాలుగా స్వార్థపూరిత రాజకీయాల పార్టీల గుప్పిట్లో కేరళ ప్రజలు చిక్కుకున్నారని, ఒకవైపు ఎల్డీఎఫ్, మరోవైపు యూడీఎఫ్ ఉన్నాయని, ఒకటి అవినీతికి, మరొకటి మెగా అవినీతికి తార్కాణమని విమర్శించారు. కేరళలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎల్డీఎఫ్ ప్రభుత్వంలో జరిగిన అన్ని కుంభకోణాలపై దర్యాప్తు జరిపిస్తామని చెప్పారు.

పశ్చిమాసియాలో సంక్షోభ పరిస్థితిపై మోదీ మాట్లాడుతూ, యుద్ధ ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయుల భద్రతకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అయితే ఇలాంటి సంక్షోభ సమయంలో కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలు ప్రమాదకరంగా ఉన్నాయని విమర్శించారు. యుద్ధం ప్రభావాన్ని తగ్గించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, ఆయా దేశాలతో నిరంతర సంప్రదింపులు సాగిస్తోందని చెప్పారు. కాగా, 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో ఏప్రిల్ 9న పోలింగ్ జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande