
డిల్లీ, 29 మార్చి (హి.స.)ప్రధాని నరేంద్రమోడీ కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పాలక్కాడ్‌లో జరిగిన భారీ సభాలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, కమ్యూనిస్టులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎల్డీఎఫ్(లెఫ్ట్ కూటమి), యూడీఎఫ్(కాంగ్రెస్ కూటమి) తప్పుడు హామీలతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. దశాబ్ధాలుగా కేరళ కాంగ్రెస్, కమ్యూనిస్టుల స్వార్థ రాజకీయాల్లో చిక్కుకుపోయిందని ఆరోపించారు. ఒకరు మతతత్వ వాదులు అయితే, మరొకరు తీవ్ర మతతత్వ వాదులు అని, ఒకరు అవినీతిపరులైతే మరొకరు అత్యంత అవినీతిపరులు అని రెండు కూటములపై ఫైర్ అయ్యారు. ఈ రెండు కూటములు కూడా ఓటు బ్యాంకు కోసమే అని, కేరళ అభివృద్ధిపై వారికి ఎలాంటి శ్రద్ధ లేదని ఆరోపించారు.
‘‘కాంగ్రెస్ బీజేపీకి బీ-టీమ్ అని కమ్యూనిస్టులు అంటుంటే, కమ్యూనిస్టులు బీజేపీకి బీ-టీమ్ అని కాంగ్రెస్ అంటుంది. ఈ రెండు పార్టీలు కూడా కేరళలో బీజేపీ ముఖ్యమని ఒప్పుకున్నాయి’’ అని ప్రధాని అన్నారు. ఈ రెండు పార్టీలు ఢిల్లీలో ఇండీ కూటమిలో భాగంగా కలిసి తిరుగుతారని, కేరళలో ప్రత్యర్థులుగా నటిస్తారని ప్రధాని అన్నారు. ఎల్డీఎఫ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని, ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితిలో ఉందని మోడీ ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు