
న్యూఢిల్లీ, 31 మార్చి (హి.స.)
బీహార్ లోని నలందా జిల్లా మఘ్రా
గ్రామంలో ఉన్న ప్రముఖ దేవాలయం అయిన శీతల (Shitala Mata Temple) మాత ఆలయంలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటనతో యావత్ రాష్ట్రం ఉలిక్కిపడింది. చైత్ర మాసం చివరి మంగళవారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో ఒక్కసారిగా తోపులాట జరగడంతో భక్తులు ఊపిరి ఆడక కిందపడిపోయారు. ఈ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారంతా మహిళలేనని అధికారులు ధ్రువీకరించారు. మరో 12 మంది ఈ ఘటనలో తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
అలాగే క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ దారుణ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ Prime Minister Narendra Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అండగా ఉండేందుకు పీఎంఆర్ఎఫ్ (PMNRF) నుండి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఎక్స్రేషియా ప్రకటించారు. స్థానిక యంత్రాంగం సహాయక చర్యలను పర్యవేక్షిస్తోందని, భక్తుల రద్దీని నియంత్రించేందుకు అదనపు బలగాలను మోహరించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు