
హైదరాబాద్, 09 మార్చి (హి.స.)శ్రీవారికి అపచారం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని, మతవిద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. సోమవారం డోన్ నియోజకవర్గంలోని కొత్తబురుజు గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటించారు. రైతులకు నూతన పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పాస్పుస్తకాలు, సర్వే రాళ్లపై జగన్ ఫొటోలు ఉండటం ఏంటి అని ప్రశ్నించారు. ఇదేంటని అడిగితే బాధితులపైనే కేసులు పెట్టారని విమర్శించారు.
వైసీపీ హయాంలో జరిగిన తప్పులను సరిచేస్తున్నామని చెప్పారు. రికార్డులు తారుమారు చేయకుండా పకడ్బంధీగా పాస్పుస్తకాలు ఇస్తున్నామని, క్యూఆర్ కోడ్తో పాస్పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఎవరు తప్పు చేసినా వెంటనే తెలుస్తుందన్నారు. ఒక్కపైసా కూడా అవినీతి లేకుండా పట్టా ఇప్పించే బాధ్యత తమదని స్పష్టం చేశారు. సమస్యలన్నీ పరిష్కరించాకే కొత్త పాక్ బుక్స్ ఇస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఎక్కడా తప్పులు జరగకుండా చూస్తామని సీఎం అన్నారు.
గత ఐదేళ్లు దుర్మార్గ పాలన సాగిందని సీఎం విమర్శించారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారని సీఎం ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేసిందని విమర్శించారు. సీబీఐ రిపోర్ట్ ఇచ్చినా లడ్డూ కల్తీపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమలపై దృష్టి పెట్టానని సీఎం తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్