
హైదరాబాద్, 09 మార్చి (హి.స.)విమాన ప్రయాణికులకు దిగ్భ్రాంతి కలిగించే ఘటన సోమవారంనాడు చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మాంచెస్టర్కు బయలుదేరిన ఇండిగో ఫ్లయిట్ 6E33 బోయింగ్ 787-9 డ్రీమ్లైనర్ అనూహ్యంగా గాలిలో ఉండగానే 'యూటర్న్' తీసుకుని వెనక్కి తిరిగొచ్చింది. ఇథియోపియా సరిహద్దు సమీపంలో ఇండిగో విమానం యూటర్న్ తీసుకుంది. అయితే దీనికి కారణం ఏమిటనేది వెంటనే తెలియలేదు
ఫ్లయిట్ ట్రాకింగ్ డాటా ప్రకారం, విమానం అకస్మాత్తుగా యూటర్న్ తీసుకోవడానికి ముందు ఇథియోపియా సరిహద్దులోని ఎయిర్స్పేస్ సమీపానికి చేరుకుంది. యూటర్న్ అనంతరం తిరిగి భారత గగనతలంలోకి అడుగుపెట్టింది. చివరి నిమిషంలో తలెత్తిన విమానయాన పరిమితులు కారణం కావచ్చని తెలుస్తోంది.
ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఎయిర్స్పేస్ పరిమితుల కారణంగా మధ్యప్రాచ్యం, ఎంపిక చేసిన అంతర్జాతీయ గమ్యాలకు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 3 వరకూ 500కు పైగా విమానాలను రద్దు చేసినట్టు ఈ నెల మొదట్లో ఇండిగో ప్రకటించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్