
హైదరాబాద్, 09 మార్చి (హి.స.)తాడేపల్లిలో నిర్వహించిన సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి కీలక సూచనలు చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఎక్కడా పార్టీకి చెందిన ఓట్లు తొలగించబడకుండా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైతే టాస్క్ఫోర్స్లా ఏర్పడి పని చేయాలని ఆయన సూచించారు. ఈ ప్రక్రియలో పార్టీ బూత్ కమిటీల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. మన పార్టీ సానుభూతిపరుల ఓట్లు అక్రమంగా తొలగించకుండా ప్రతి స్థాయిలో పర్యవేక్షణ ఉండాలని అన్నారు. తెలంగాణలో ఇంటింటి సర్వే జరుగుతున్న నేపథ్యంలో, ఇక్కడ కూడా సచివాలయ సిబ్బంది ఓటర్ల జాబితా సవరణ పనులు ప్రారంభించినట్లు సమాచారం ఉందని సజ్జల తెలిపారు. అందువల్ల మరింత అప్రమత్తంగా వ్యవహరించి పార్టీ ఓటర్లను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, అధికార పార్టీ ఆగడాలు మరియు పార్టీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్న తీరుపై మరింత జాగ్రత్తగా ఉండాలని అన్నారు. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులు ముందుగానే వ్యూహాత్మకంగా పనిచేయాలని సూచించారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాల వరకు తీసుకువెళ్లడం, పార్టీకి చెందిన ఓట్లు తొలగించకుండా కాపాడుకోవడం ప్రతి కార్యకర్త బాధ్యత అని ఆయన తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు తప్పకుండా వస్తుందని చెప్పారు. ప్రస్తుతం పార్టీకి సుమారు 16 లక్షల మంది నెట్వర్క్ ఏర్పాటయ్యిందని, పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్