
కోల్కత్త, 10 ఏప్రిల్ (హి.స.)
పశ్చిమ బెంగాల్లో రెండు దశల్లో
జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (BJP) తన ఎన్నికల మేనిఫెస్టో సంకల్ప పత్రం(Sankalpa Patram) శుక్రవారం విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోల్కతాలో జరిగిన విలేకరుల సమావేశంలో దీనిని ఆవిష్కరిస్తూ.. రాష్ట్రంలో చొరబాటుదారులపై కఠిన చర్యలు, మెరుగైన శాంతిభద్రతలు, మహిళలకు ఆర్థిక సాయం, ఏడో వేతన సంఘం అమలు వంటి కీలక హామీలను ప్రకటించారు.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోనే యూనిఫామ్ సివిల్ కోడ్(UCC)ని అమలు చేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. అలాగే.. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏడో వేతన సంఘాన్ని కేవలం 45 రోజుల్లోనే పట్టాలెక్కిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేనిఫెస్టో రైతులు, యువత, మహిళలకు కొత్త దిశానిర్దేశం చేస్తుందని, ప్రధాని మోదీ ఆకాంక్షించే వికసిత్ భారత్ రోడ్మ్యప్ను బెంగాల్ ప్రజల ముందుకు తెస్తుందని ఆయన పేర్కొన్నారు.
'
మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అమిత్ షా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత 15 ఏళ్లలో బెంగాల్ తీవ్ర నిరాశకు గురైందని, దీనిపై తాము ఛార్జ్ షీట్ సిద్ధం చేశామని చెప్పారు. చొరబాటుదారులతో కుమ్మక్కు కావడం, తప్పుడు వాగ్దానాల వల్లే మమతా బెనర్జీ మూడుసార్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారని ఆరోపించారు. గతంలో కమ్యూనిస్టు పాలన వదిలించుకోవడానికి ప్రజలు మమతను ఎన్నుకున్నారని, కానీ ఇప్పుడు ఆమె హయాంలో సిండికేట్లు, గుండారాజ్, చొరబాటుదారులు పెరిగిపోయారని మండిపడ్డారు.
'సోనార్ బంగ్లా' దిశగా అడుగులు
వికసిత్, సోనార్ (బంగారు) పశ్చిమ బెంగాల్ను నిర్మించడానికి ఈ సంకల్ప పత్రం ఒక మార్గదర్శి అమిత్ షా తెలిపారు. రాష్ట్ర ప్రజలు మనస్ఫూర్తిగా మార్పు కోరుకుంటున్నారని, బీజేపీకి పట్టం కడతారనే నమ్మకం తనకు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..