
ముంబై, 10 ఏప్రిల్ (హి.స.)
బ్యాంకులు తమ ఆర్బిట్రేజ్ పొజిషన్లను రద్దు చేసుకునేందుకు RBI విధించిన గడువు నేటితో ముగియనుంది. ఈ క్రమంలో ఫారెక్స్ మార్కెట్లో అమెరికన్ డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ బలపడింది.
గత మార్చి 27న ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. ప్రతి బ్యాంకు తమ నెట్ ఓపెన్ పొజిషన్ (Net Open Position NOP)ను రోజువారీగా 100 మిలియన్ డాలర్లకు మాత్రమే పరిమితం చేయాలి. గతంలో ఇది బ్యాంకుల మొత్తం క్యాపిటల్లో 25% వరకు ఉండేది. ఈ గడువు నేటితో ముగియనుండటంతో, బ్యాంకులు తమ వద్ద ఉన్న అదనపు డాలర్ పొజిషన్లను భారీగా మార్కెట్లో విక్రయించాయి. దాదాపు 30 బిలియన్ డాలర్ల విలువైన పొజిషన్లను బ్యాంకులు ఈ కొద్ది రోజుల్లోనే రద్దు చేసినట్లు ట్రేడింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
పశ్చిమాసియా (Middle East) దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల మార్చి నెలలో రూపాయి విలువ భారీగా క్షీణించి రికార్డు స్థాయిలో రూ.95.22 కు పడిపోయింది. రూపాయి మరింత పతనం కాకుండా అడ్డుకోవడానికి మరియు మార్కెట్లో స్పెక్యులేషన్ను తగ్గించడానికి ఆర్బీఐ ఈ కఠినమైన గడువును విధించింది. బ్యాంకులు గడువు పొడిగించాలని కోరినప్పటికీ, ఆర్బీఐ నిరాకరించడంతో ఈ వారమంతా మార్కెట్లో భారీగా పొజిషన్ల రద్దు కొనసాగింది. ఫలితంగా రూపాయి గత నాలుగు సెషన్లుగా వరుసగా లాభపడుతూ వస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..