
అల్లూరి జిల్లా, 14 ఏప్రిల్ (హి.స.)
డుంబ్రిగుడ మండలం కొదోంజొల గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఉయ్యాల ఊగుతూ ప్రమాదవశాత్తు బాలిక మృతి చెందింది. 11 ఏళ్ల మాధవి.. తమ్ముడిని నిద్రపుచ్చి ఉయ్యాల ఊగుతోంది. ఒక్కసారిగా ఉయ్యాల మెడకు చుట్టుకుని ఊపిరాడక ప్రాణాలుకోల్పోయింది బాలిక. తల్లి బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘోరం జరిగింది. కాసేపటికి తల్లి ఇంటికి వచ్చి చూడగా కూతురి మెడకు ఉయ్యాల ఉచ్చులా బిగించి ఉండటం గమనించింది. వెంటనే మాధవిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే బాలిక మృతిచెందింది. దీంతో అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
వ్యవసాయ పనులకు గ్రామస్తులంతా వెళ్లడంతో చిన్నారిని కాపాడే అవకాశం లేకుండా పోయిందని గ్రామస్తుల ఆవేదన వ్యక్తం చేశారు. మాధవి కుసుంగుడ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదవుతోంది. తమ్ముడిని లాలించమని చెప్పి వెళ్లానని.. ఇంతలోనే ఇలా జరుగుతుందని అనుకోలేదంటూ తల్లిదండ్రులు బోరున విలపించారు. చిన్నారి మృతితో కొదోంజొల గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ