
హైదరాబాద్, 15 ఏప్రిల్ (హి.స.)తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం తన గొంతు వినిపిస్తున్నానని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా చేశారా? అని ఆయన ప్రశ్నించారు. తుపాకీ పట్టుకొని ఆయన ఎవరి పక్కన నిలుచున్నారో అందరికీ తెలుసునన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కేరళ నుంచి ఎందుకు పోటీ చేశారంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నిలదీశారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావ్వడం తెలుగు వాడిగా తనకు గౌరవంగా ఉందన్నారు.
తనపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బుధవారం న్యూఢిల్లీలో ఎంపీ కె. లక్ష్మణ్ స్పందించారు. నీతులు చెబుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. గ్రేటర్ హైదరాబాద్ను మూడు ముక్కలు చేశారని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ పరిధిలో150 సీట్లను 300 సీట్లు చేశారని పేర్కొన్నారు. ఏ శాస్త్రీయ పద్ధతిలో గ్రేటర్ హైదరాబాద్ను విభజించారంటూ సీఎంను ఆయన సూటిగా ప్రశ్నించారు.
డీలిమిటేషన్ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా ప్రస్తుతం ఉన్న సీట్ల నిష్పత్తికి అనుగుణంగా అవి పెరుగుతాయని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. ప్రధాని మోదీకి పెరుగుతున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేక పోతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. అందుకే డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లుల పట్ల రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటనలు చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీల నేతలపై ఆయన విరుచుకు పడ్డారు.
జీఎస్డీపీ ప్రకారం డీలిమిటేషన్ చేయాలన్నది కాంగ్రెస్ విధానమా? అనేది స్పష్టం చేయాలని ఆ పార్టీ నేతలను ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఓటు విలువ ధనిక, పేద అనే వ్యత్యాసం లేకుండా అందరికీ సమానంగా ఉంటుందని అభిప్రాయ పడ్డారు. జీడీపీలో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయని గుర్తు చేశారు.
మహిళల అవకాశాలను దెబ్బ తీయడానికి కుట్ర పన్నుతున్నారంటూ విపక్షాలపై ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. మహిళల వాటా తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారా?, ఎస్సీ, ఎస్టీ వాటా అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతున్నారా? అంటూ విపక్షాలకు ఆయన ప్రశ్నలు సంధించారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్యం అంటే డబ్బే అని వ్యంగ్యంగా అన్నారు. ఢిల్లీకి ఆయన డబ్బుల మూటలు మోశారని ఆరోపించారు. నగదు కేంద్రంగా రాజకీయం చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్