
మేడ్చల్ మల్కాజ్గిరి, 15 ఏప్రిల్ (హి.స.)
మూడు చింతలపల్లి మున్సిపాలిటీ
పరిధిలోని కొల్తూరులో గంజాయి విక్రయిస్తున్న ముఠాను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు కొల్తూరు నుంచి తుర్కపల్లి వెళ్లే మార్గంలోని ఓ గ్రౌండ్లో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి అమ్ముతున్నట్లు తెలిసి పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో మొత్తం 13 మంది గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించగా, ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఏడుగురు పరారయ్యారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.2 లక్షల విలువ చేసే 3 కిలోల గంజాయి, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారంతా సమీప గ్రామాలకు చెందిన యువకులేనని పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సామగ్రిని తుర్కపల్లి జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..