
పాకిస్థాన్ , 16 ఏప్రిల్ (హి.స.)
పాకిస్థాన్ గడ్డపై ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాద నేతలకు అజ్ఞాత వ్యక్తుల భయం పట్టుకుంది. భారత్ లక్ష్యంగా దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన లష్కరే తోయిబా వ్యవస్థాపక సభ్యుడు అమీర్ హమ్జాపై లాహోర్లో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన హమ్జా,ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఉగ్రవాది హఫీజ్ సయిద్తో లిసి 1985లో లష్కరే తోయిబాను హమ్జా స్థాపించారు. భారత్ లో జరిగిన అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు అతనికి లింకులు ఉన్నాయి. హఫీజ్ సయీద్ తర్వాత హమ్జా లష్కరే గ్రూపులో రెండో కీలక వ్యక్తిగా ఎదిగారు. హమ్జాను ఉగ్రవాదిగా అమెరికా ముద్రవేసింది. లాహోర్లో ఉన్న ఓ న్యూస్ ఛానల్ ఆఫీసు ఆవరణలో అతనిపై కాల్పులు జరిపారు.
హమ్జా బయటకు రాగానే మాటువేసిన దుండగులు అతడిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి పరారయ్యారు. గతేడాది మే నెలలో కూడా అతని నివాసం వద్ద ఇలాంటి దాడి జరగ్గా తృటిలో తప్పించుకున్నాడు. ఆ సమయంలో పాక్ అధికారులు అతనికి భద్రతను పెంచినప్పటికీ తాజాగా జరిగిన దాడిలో అతడు తీవ్రంగా గాయపడటం చర్చనీయాంశం అయింది.
1959లో ఆమిర్ హమ్జా జన్మించారు. అతను మాజీ ఆఫ్ఘన్ ముజాయిదిన్. లష్కరే ఐడియాలజీలో కీలక వ్యక్తి అతను. అతని వయసు 66 ఏళ్లు. 2005లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్పీ)పై జరిగిన భీకర ఉగ్రదాడికి ఇతడే మాస్టర్ మైండ్గా భారత్ భావిస్తోంది. కాశ్మీర్ వెలుపల లష్కరే జరిపిన మొదటి పెద్ద దాడి ఇదే కావడం గమనార్హం.
లష్కరే తోయిబా సంస్థ ప్రచార విభాగం మొత్నాన్ని హమ్జాయే నడిపించేవాడు. విద్వేషపూరిత ప్రసంగాలు చేయడంలో, పుస్తకాలు రాయడంలో ఇతడు దిట్ట కాగ అమెరికా ట్రెజరీ విభాగం ఇతడిని గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించి, ఆర్థిక ఆంక్షలు విధించింది. 2018లో లష్కరే తోయిబా, దాని అనుబంధ సంస్థలైన జమాత్-ఉద్-దవాపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో దూరంగా ఉంటున్నారు.
‘జైష్-ఎ-మన్కాఫా’ అనే కొత్త చీలిక వర్గాన్ని ఏర్పాటు చేసి, కాశ్మీర్ కేంద్రంగా నిధుల సేకరణ, ఉగ్రవాద నియామకాలు చేపడుతున్నాడు. సంస్థ నుంచి విడిపోయినప్పటికీ హఫీజ్ సయ్యద్కు అత్యంత నమ్మకస్తుడిగా ఇతడికి పేరు ఉంది. పాకిస్థాన్లో గత కొంత కాలంగా భారత్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఉగ్రవాదులు వరుసగా ‘అజ్ఞాత వ్యక్తుల’ చేతిలో హతమవుతుండటం గమనార్హం. తాజా దాడితో పాక్ గడ్డపై ఉన్న మిగిలిన ఉగ్రనేతల్లో వణుకు మొదలైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi