
హైదరాబాద్, 16 ఏప్రిల్ (హి.స.)మహిళా రిజర్వేషన్లను తీసుకురావడంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని పేర్కొన్నారు . చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు తుది రూపం ఇచ్చేందుకు, డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు ఉద్దేశించిన 3 కీలక బిల్లులను కేంద్రం నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వీటిపై చర్చలో భాగంగా ప్రధాని మోద సభలో ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించే వారు మూల్యం చెల్లించుకోక తప్పదంటూ విపక్షాలను హెచ్చరించారు.
గిఫ్ట్ కాదు.. ఇది హక్కు
‘‘దేశ పార్లమెంట్ చరిత్రలో ఈ రోజును మర్చిపోలేం. మహిళా రిజర్వేషన్ గొప్ప బిల్లు. ఈ చారిత్రక సమయంలో పాలు పంచుకోవడం నా అదృష్టం. ఈ బిల్లులతో దేశానికి సరికొత్త దశ, దిశను ఇస్తున్నాం. వికసిత్ భారత్ అంటే రోడ్లు, రైళ్లు, మౌలిక సదుపాయాలు మాత్రమే కాదు. మహిళల స్వావలంబన కూడా ఉంటేనే అది సంపూర్ణ వికసిత్ భారత్ అవుతుంది. దేశ రాజకీయాల్లో, వికసిత్ భారత్ సాధనలో మహిళల పాత్ర కీలకం. మహిళలకు అవకాశమిస్తే దేశానికి సరికొత్త మార్గం చూపిస్తారు. రాజకీయాల్లో తమ శక్తిని చాటేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారు. ఎవరికైనా అవకాశమిస్తేనే కదా.. వారి సామర్థ్యం తెలుస్తుంది. రాజకీయాల్లో సామర్థ్యం, అనుభవం ఉన్న మహిళలు పుష్కలంగా ఉన్నారు. దేశ ప్రగతిలో మహిళలకూ భాగస్వామ్యం కల్పించాల్సిందే. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు.. మహిళలకు మనం ఇస్తున్న కానుక కాదు. అది వారి హక్కు’’ అని మోదీ వ్యాఖ్యానించారు
‘‘మహిళా రిజర్వేషన్ల కోసం 30 ఏళ్ల పాటు ప్రయత్నాలు జరిగినా గతంలో ఇది సాకారం కాలేదు. 2024 ఎన్నికల్లో వీటిని అమలు చేద్దామని మేం ప్రయత్నించినా సాధ్యం కాలేదు. 2029 ఎన్నికల్లోనూ రిజర్వేషన్లు ఇవ్వకపోతే మహిళలకు అన్యాయం చేసినట్లే. ఈ బిల్లును తేవడంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదు. ఇది రాజకీయ పార్టీల కోసం తెచ్చింది కాదు. మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించే వారిని మహిళలు క్షమించరు. బిల్లును వ్యతిరేకించే పార్టీలకు, నేతలకు మహిళలు బుద్ధి చెబుతారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు