
అమరావతి, 17 ఏప్రిల్ (హి.స.)రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠా నియామకానికి ఆమోదం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోద ముద్ర వేశారు. మరికొద్ది సేపట్లోనే అనిల్ చంద్ర పునేఠాను ఎస్ఈసీగా నియమిస్తూ ప్రభుత్వం జీఓను విడుదల చేయనుంది. అనిల్ చంద్ర పునేఠా గతంలో రాష్ట్ర ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. ప్రస్తుతం ఆయన విజిలెన్స్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
గవర్నర్ ఆమోదం లభించడంతో ప్రభుత్వం కాసేపట్లో అధికారిక జీఓ జారీ చేసి.. అనిల్ చంద్ర పునేఠాకు పూర్తి బాధ్యతలు అప్పగించనుంది. పంచాయతీలు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్తుల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ నియామకం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అనిల్ చంద్ర పునేఠా ఐఏఎస్ 1984 బ్యాచ్ అధికారి. రాష్ట్రంలో వివిధ కీలక శాఖల్లో పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. గతంలో కొన్ని సందర్భాల్లో ఎన్నికల సంబంధిత బాధ్యతలు కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. జీఓ విడుదలైన వెంటనే అధికారికంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా బాధ్యతలు చేపట్టనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్