
ములుగు, 02 ఏప్రిల్ (హి.స.)
వ్యాపారాలు చేసేందుకు ముందుకు వచ్చే మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతి మహిళ 'మహిళా సంఘాలలో' చేరాలని మంత్రి సీతక్క అన్నారు. వ్యాపార రంగాల్లో రాణిస్తున్న మహిళలు తమ కుటుంబాన్ని పోషించే స్థాయికి ఎదిగి ఆర్థికంగా బలోపేతం కావాలని అన్నారు. గురువారం వెంకటాపూర్ మండల కేంద్రంలో 10 లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన మహిళ సమాఖ్య భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో కలెక్టర్ దివాకర్ టిఎస్ తో కలిసి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాలలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 4 లక్షల 70 వేల మహిళా సంఘాల వారికి వడ్డీ లేని రుణాలను అందించి వివిధ వ్యాపారాలు చేసుకోవడానికి ప్రజా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, వ్యాపారంలో భాగస్వాములైన మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల ముగిసిన మేడారం మహా జాతర సందర్భంగా 560 మంది మహిళలకు 6 వందల కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాలు అందించగా పక్షం రోజులలోనే మూడు కోట్ల 50 లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్థించారని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు