
హైదరాబాద్, 02 ఏప్రిల్ (హి.స.)
ఈ జోన్ సరుకు రవాణా విభాగంలో భారీగా రూ. 13,835.27 కోట్లు మరియు ప్రయాణీకుల విభాగంలో రూ. 6,235.37 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది
దక్షిణ మధ్య రైల్వే 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 21,211.92 కోట్ల స్థూల ఆదాయాన్ని నమోదు చేసింది. జోన్ ప్రారంభమైనప్పటి నుండి నమోదైన ఇదే అత్యధిక ఆదాయం. దక్షిణ మధ్య రైల్వే బృందం అంకితభావంతో చేసిన కృషి ఫలితంగా, ఈ జోన్ గత నాలుగు ఆర్థిక సంవత్సరాలుగా వరుసగా ఆదాయం విషయంలో రికార్డు స్థాయి గణాంకాలను నమోదు చేస్తూ వస్తోంది. గత ఆర్థిక సంవత్సరం (2024-25)తో పోలిస్తే, సరుకు రవాణా మరియు ప్రయాణీకుల విభాగాలలో అద్భుతమైన పనితీరు కారణంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ జోన్ 3.12శాతం వృద్ధిని నమోదు చేసింది.
ఈ జోన్ సరుకు రవాణా విభాగంపై ప్రత్యేక దృష్టి సారించడం వల్ల, స్థూల ఆదాయంలో ఈ అద్భుతమైన విజయాన్ని నమోదు చేయడం ద్వారా సాధ్యమైంది. దక్షిణ మధ్య రైల్వే సరుకు రవాణాలో వైవిధ్యభరితంగా చేసిన ముమ్మర కృషి ఫలితంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో 147.87మిలియన్ టన్నుల సరుకును రవాణా చేయడం ద్వారా, రూ. 13,835.27 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. అంతేకాకుండా దక్షిణ మధ్య రైల్వే 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రయాణీకుల రవాణా ద్వారా రూ. 6235.37 కోట్ల రికార్డు స్థాయి ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది గత 2024-25ఆర్థిక సంవత్సరం లో నమోదైన అత్యుత్తమ గణాంకమైన రూ. 5714.83 కోట్ల కంటే 9.11శాతం మేర అధికం. అంతేకాకుండా రైల్వే బోర్డు నిర్దేశించిన లక్ష్యాన్ని కూడా ఈ జోన్ 1.42 శాతం మేర అధిగమించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 286.44 మిలియన్ల మంది ప్రయాణీకులు ప్రయాణం చేయడం ద్వారా ఈ రికార్డు ఆదాయాలు సాధ్యమయ్యాయి.
2025-26 సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే ఇతర కోచింగ్ విభాగంలో రూ. 515.18 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందన్నది గమనార్హం. ఈ ఇతర కోచింగ్ ఆదాయంలో పార్శిల్ ఆదాయం, టికెట్ తనిఖీ జరిమానాలు, కోచ్ బుకింగ్ మొదలైనవి చేరి ఉన్నాయి. అంతేకాకుండా, ఈ జోన్ ఇతర ఆదాయాల కింద రూ. 626.10 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది గత ఆర్థిక సంవత్సరం (2024-25) కంటే 36.98శాతం అధికం. ఈ ఇతర ఆదాయాలలో పార్కింగ్, క్యాటరింగ్, ప్రయాణేతర ఆదాయం, పే & యూజ్ టాయిలెట్లు, విశ్రాంతి గదులు మొదలైనవి చేరి ఉన్నాయి.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈ అత్యుత్తమ పనితీరును సాధించినందుకు అధికారులు మరియు సిబ్బంది చేసిన కృషిని ప్రశంసించారు. ఈ మైలురాయి దక్షిణ మధ్య రైల్వే బృందం యొక్క సమిష్టి నిబద్ధతను, సమన్వయ ప్రయత్నాలను ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. జనరల్ మేనేజర్ నిరంతర ఆవిష్కరణలు, మెరుగైన సామర్థ్యం మరియు వినియోగదారుల-కేంద్రీకృత విధానం ద్వారా భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు