
రాజమండ్రి, 02 ఏప్రిల్ (హి.స.)గత వైసీపీ పాలనలో ఏపీలో విధ్వంసం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యలు చేశారు. గురువారం రాజమండ్రి కలెక్టరేట్లో జరిగిన తూర్పుగోదావరి జిల్లా బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర విభజనతో జరిగిన నష్టం కంటే గత ఐదేళ్ల వైసీపీ పాలనతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్ మీదకు వెళ్లిందన్నారు. నాడు తాడేపల్లి, ఇడుపులపాయ ఖజానాలు నింపుకొని.. రాష్ట్ర ఖజానా లూటీ చేశారని ఆరోపించారు.
గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఖాళీ చిల్లుకుండ ఇచ్చి పోయారంటూ మంత్రి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024-25లో జీఎస్డీపీ11.89 శాతం వృద్ధి సాధించామని తెలిపారు. వేసవిలో గోదావరి డెల్టా ప్రధాన కాలువలలో సిల్టును తొలగించేందుకు నిధులు కేటాయిస్తామని తెలిపారు.
గోదావరి డెల్టా లైడార్ సర్వే పూర్తయిందని.. త్వరలోనే డీపీఆర్ సిద్ధం చేస్తామని చెప్పారు. ఈనెల 15 నాటికి గోదావరి డెల్టాకు రబీ సీజన్ పూర్తవుతుందన్నారు. అవసరమైతే రైతుల డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని గోదావరి డెల్టా కాలువలకు సాగునీరు సరఫరా పొడిగిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్