హుజూరాబాద్లో ‘డంపింగ్ యార్డ్' సెగ.. కలెక్టరేట్ ముట్టడి
హుజూరాబాద్లో ‘డంపింగ్ యార్డ్' సెగ..
Dumping yard


హుజురాబాద్, 20 ఏప్రిల్ (హి.స.)

హుజూరాబాద్ మండలంలోని సిరసపల్లి శివారులో ప్రభుత్వం ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్ (వేస్ట్ ఎనర్జీ ప్లాంట్)కు వ్యతిరేకంగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. ఈ ప్లాంట్ ఏర్పాటును నిరసిస్తూ హుజూరాబాద్ పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు సోమవారం జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలను పోలీసులు ప్రధాన గేటు వద్దే నిలిపివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఆగ్రహించిన నిరసనకారులు కలెక్టరేట్ ఎదుటే ప్లకార్డులు, ఫ్లెక్సీలతో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా డంపింగ్ యార్డ్ వ్యతిరేక అఖిలపక్ష కమిటీ నాయకులు మాట్లాడుతూ.. గత 30 రోజులుగా హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో శాంతియుతంగా దీక్షలు చేపడుతున్న, ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రజల గోడు ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని వారు మండిపడ్డారు. పట్టణ వ్యర్థాలను గ్రామాల మీదకు నెట్టడం ఏంటని వారు ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే సారవంతమైన భూములు విషతుల్యమవుతాయి. భూగర్భ జలాలు కలుషితమై వ్యవసాయం కుంటుపడుతుంది. గాలి కలుషితం కావడం వల్ల చిన్నారులు, వృద్ధులు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పాడి పంటలకు నిలయమైన ఈ ప్రాంతాన్ని ఉరిశాలగా మార్చవద్దని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.మరింత తక్షణమే ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ప్రతిపాదనను రద్దు చేయాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. భవిష్యత్తులో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande