
విజయవాడ, 20 ఏప్రిల్ (హి.స.)ప్రతి ఒక్కరి కడుపు నిండాలని.. ఎవరూ ఆకలిలో ఉండకూడదనేదే అన్న క్యాంటీన్ల ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అన్న ఎన్టీఆర్.. తిరుమలలో ప్రారంభించిన అన్నప్రసాదం కార్యక్రమం స్ఫూర్తితో ఈ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు. సోమవారం విజయవాడ పటమటలో అన్న క్యాంటీన్ను సీఎం చంద్రబాబు దంపతులు ప్రారంభించారు.
అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పేద వారికి కేవలం దానం చేసినట్లుగా కాకుండా, వారు గౌరవ ప్రదమైన వాతావరణంలో.. శుభ్రమైన, నాణ్యమైన పౌష్టికాహారాన్ని పొందేలా చూడటమే ఈ కార్యక్రమం ప్రత్యేకత అని చెప్పారు. ఇక్కడ ప్రత్యేకమైన క్యాంపస్, కాంపౌండ్ వాల్, పరిశుభ్రమైన వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు. కేవలం రూ.5లకే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటలా భోజనం అందిస్తున్నారని వివరించారు.
ఆటో డ్రైవర్లు, ముఠా కార్మికులు, రోడ్లు ఊడ్చేవారు, ఇతర సామాన్య ప్రజలకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన ఆశాబావం వ్యక్తం చేశారు. ఇస్కాన్ ఫౌండేషన్ వారు సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా చాలా రుచికరమైన, నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నారని గుర్తు చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 269 అన్న క్యాంటీన్లు పని చేస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇటీవల 62 కొత్త క్యాంటీన్లను ప్రారంభించామన్నారు. త్వరలోనే మరో 5 క్యాంటీన్లు ప్రారంభించి.. వాటి సంఖ్యను 274 కు చేర్చనున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లలో రూ.76 లక్షల వ్యయంతో మూడు పూటలా ఉచిత భోజనం అందించేందుకు ముందుకు వచ్చిన తన సతీమణి నారా భువనేశ్వరిని ఈ సందర్భంగా చంద్రబాబు అభినందనలతో ముంచెత్తారు.
ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా.. ఒక పూట భోజనం లేదా ఒక రోజు క్యాంటీన్ ఖర్చును భరించడం ద్వారా ఈ అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ప్రజలను కోరుతున్నామన్నారు. ఇది కేవలం ప్రభుత్వం చేసే పని మాత్రమే కాకుండా, ప్రజలందరూ ఒక స్ఫూర్తితో కలిసి రావాల్సిన వేదిక ఇది అని పేర్కొన్నారు. ప్రజలను ఆదుకునే కార్యక్రమాలు నిరంతరాయంగా జరగాల్సి ఉందన్నారు.
ఇది కేవలం ఒక పూట ఆహారం అందించడంతో ముగిసిపోయేది కాకూడదని.. ప్రజల అభివృద్ధి కోసం దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్లాల్సి ఉందని చెప్పారు. వారిని మనతో సమానంగా అన్ని రంగాల్లో పైకి తీసుకురావాల్సి ఉందని చెప్పారు. సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలను తగ్గించే దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అదే నిజమైన ప్రజాస్వామ్యం, సమాజానికి స్ఫూర్తి కూడా అని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అంటేనే 'అన్నపూర్ణ' అని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎవరూ కూడా ఆకలితో అలమటించ కూడదన్నారు. గత ప్రభుత్వం పేదలకు అన్నం పెట్టే 'అన్న క్యాంటీన్లను' మూసివేసిందని విమర్శించారు. భోజనం పెట్టే వారిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం వారి ప్రవర్తనకు నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పేదలను ఆదుకోవడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలంటూ ప్రజలకు ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్