
కరీంనగర్, 15 మే (హి.స.)
పండించిన పంటను అమ్ముకోవడానికి పడరాని పాట్లు పడాల్సి వస్తుందని ధాన్యం కొనుగోలు చేయాలని రోడ్డెక్కే పరిస్థితులు దాపురించాయని కరీంనగర్ జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు తీవ్రంగా వేధిస్తున్న హమాలీల కొరత, మిల్లులలో దిగుమతి కాకపోవడం తదితర కారణాలతో కాంటాలు సక్రమంగా కొనసాగక పోవడంతో రైతులు మార్కెట్లలో తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రోజుల తరబడి మార్కెట్లో వేచి చూస్తున్న రైతులకు నిరాశే మిగులుతుందని ఆగ్రహించిన రైతన్నలు జాతీయ రహదారిపై బైఠాయించారు. శంకరపట్నం మండలంలోని తాడికల్ సహకార సంఘం పరిధిలోని కేశవపట్నం మార్కెట్ యార్డులో ధాన్యం కాంటాలు సరిగా నిర్వహించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు.. ధాన్యం కొనుగోలు ఆలస్యం అవుతుందని అధికారుల పర్యవేక్షణ లోపించిందని అన్నారు. వెంటనే కొనుగోళ్ళను వేగవంతం చేయాలని వారు డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు