పాత్రికేయుల సమస్యల పరిష్కారం కోసం కృషి :మంత్రి సీతక్క
పాత్రికేయుల సమస్యల పరిష్కారం కోసం కృషి :మంత్రి సీతక్క
సీతక్క


ములుగు, 15 మే (హి.స.)

దేశంలో, రాష్ట్రంలో నాలుగో స్తంభంగా నిలిచిన పత్రికా రంగం ఎంతో విలువైనదని,పాత్రికేయులు అంకితభావంతో పని చేస్తూ ముందుకు సాగాలని మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. శుక్రవారం వారు ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన జర్నలిస్ట్ యూనియన్ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐజేయూ) ద్వితీయ మహాసభ జిల్లా అధ్యక్షులు షఫీ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ జిల్లాలో రాష్ట్రంలో పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని, గొప్ప జిల్లాగా పేరొందిన ములుగు జిల్లాలో పాత్రికేయ వృత్తిలో కొనసాగడం ప్రతి ఒక్కరి అదృష్టమని అన్నారు.

దట్టమైన అడవులు, కాకతీయ కళా సంపద, సరస్సులు కలిగిన ములుగు పర్యాటక రంగంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని, పర్యాటక రంగ విశేషాలను ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి పాత్రికేయులు ఎంతగానో దోహదపడుతున్నారని హర్షం వ్యక్తం చేశారు.

రానున్న కాలంలో ములుగు జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచడానికి చేస్తానని, ముఖ్యంగా పాత్రికేయుల కోసం ప్రత్యేకంగా ప్రెస్ క్లబ్ ఏర్పాటు, ఇండ్ల స్థలాల కేటాయింపు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిరుపేద పాత్రికేయులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పాత్రికేయులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande