
హైదరాబాద్, 15 మే (హి.స.)
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన ప్రభుత్వం వాటిని అమలు చేసే దిశగా కీలక కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇవాళ ఆర్టీసీ సంఘాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం అయ్యారు. మినిస్టర్ క్వార్టర్స్ లో జరిగిన ఈ సమావేశంలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, కార్మిక సంఘాల ఎన్నికలు, తదితర అంశాలపై చర్చించారు. కాగా ఆర్టీసీని విలీనం చేయడంతో పాటు తమ సమస్యలను పరిష్కారించాలనే డిమాండ్తో గత నెలలో ఆర్టీసీ జేఏసీ బంద్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మే 1వ తేదీన ఆర్టీసీ యూనియన్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో యూనియన్లకు ఎన్నికలు కావాలా? లేదా ప్రభుత్వంలో విలీనమా తేల్చుకోవాలంటూ సీఎం జేఏసీ నేతలకు ఆఫర్ ఇచ్చారు. ఆప్షన్ రూపంలో చెప్పాలని ఆదేశించగా అదే సమయంలో మారు ఆలోచన లేకుండా విలీనమే చేయాలని, యూనియన్లు కావాలనే డిమాండ్ను వదులుకుంటున్నామని ముక్తకంఠంతో నేతలు సమ్మతి తెలిపారు. అయితే రవాణాశాఖ మంత్రి దృష్టికి తెస్తే ప్రక్రియ మొదలవుతుందని అందరూ సమ్మతించిందే జరుగుతుందని సీఎం ఈ సమావేశంలో స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..