శ్రీశైలంలో చిరుత పులుల కలకలం.. మొన్న పాలిటెక్నిక్, నేడు ఐటీఐ కాలేజీలోకి ప్రవేశించిన చిరుత!
శ్రీశైలం, 02 మే (హి.స.) శ్రీశైలం, సున్నిపెంట పరిసర ప్రాంతాల్లో చిరుతపులుల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. వరుసగా విద్యాసంస్థల సమీపంలో వన్యప్రాణులు కనిపిస్తుండటంతో స్థానికులు, విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా సున్నిపెంటలోని ఐటీఐ క
శ్రీశైలం


శ్రీశైలం, 02 మే (హి.స.)

శ్రీశైలం, సున్నిపెంట పరిసర ప్రాంతాల్లో చిరుతపులుల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. వరుసగా విద్యాసంస్థల సమీపంలో వన్యప్రాణులు కనిపిస్తుండటంతో స్థానికులు, విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా సున్నిపెంటలోని ఐటీఐ కళాశాల వద్దకు ఓ చిరుత పులి రావడం స్థానికంగా అలజడి సృష్టించింది. ఐటీఐ కళాశాల కాంపౌండ్ వాల్ ఎక్కిన చిరుతను గమనించిన కళాశాల సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయంతో పరుగులు తీసిన వారు.. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీ సిబ్బంది అప్రమత్తమై ఆ ప్రాంతానికి చేరుకున్నారు.

ఇదిలా ఉండగా, కేవలం రెండు రోజుల క్రితమే శ్రీశైలంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో చిరుతల సంచారం వెలుగుచూసింది. ఏకంగా రెండు చిరుతలు అక్కడ సంచరిస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. రెండు చిరుతలు జనవాసాల మధ్యే తిరుగుతుండటంతో స్థానికులు, చుట్టుపక్కల నివాసితులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

చిరుతల సంచారం నేపథ్యంలో సున్నిపెంట ప్రాంత వాసులు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఆ రెండు చిరుతలను బంధించేందుకు అటవీశాఖ అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఎవరూ ఒంటరిగా బయటకు రావొద్దని, అత్యవసరమైతే తగిన జాగ్రత్తలతో గుంపులుగా వెళ్లాలని అటవీశాఖ అధికారులు ప్రజలకు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande