
కలకత్తా, 31 మే (హి.స.)
దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ రాజకీయాలపైనే చర్చ నడుస్తోంది. శనివారం మమతా బెనర్జీ మేనల్లుడు, డైమండ్ హార్బర్ ఎంపీ అయిన అభిషేక్ బెనర్జీపై సోనార్‌పూర్‌లో స్థానికులు దాడికి దిగారు. ఈ దాడి వెనక బీజేపీ ఉందని టీఎంసీ ఆరోపిస్తుంటే, టీఎంసీ అంతర్గత సంక్షోభాలే దాడికి కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
ఇదిలా ఉంటే, మేనల్లుడు అభిషేక్‌పై దాడి కన్నా మమతా బెనర్జీకి అతిపెద్ద షాక్‌లు తగులుతున్నాయి. ఆదివారం నిర్వహించిన సమావేశానికి టీఎంసీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో 20 మంది మాత్రమే హాజరయ్యారు. కీలక సమావేశానికి ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం సంచలనంగా మారింది. ఈ పరిణామాలు చూస్తే టీఎంసీలో సంక్షోభం మరింత ముదిరినట్లు తెలుస్తోంది. ఏకంగా 60 మంది రాకపోవడంతో మమతా బెనర్జీ సమావేశాన్ని రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఆదివారం తన నివాసంలో మమత ఈ భేటీని ఏర్పాటు చేసింది. శాసనసభాపక్ష నాయకుడు శోవన్దేబ్ చటోపాధ్యాయ్ ఈ భేటీకి పిలుపునిచ్చారని తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు