
సిద్దిపేట, 04 మే (హి.స.)
ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం “ప్రజావాణి” కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్ స్థాయిలో కూడా నిర్వహించాలని నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ కే. హైమావతి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం.3 ప్రకారం ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా స్థాయితో పాటు రెవెన్యూ డివిజన్ స్థాయిలో కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిలో ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మన జిల్లాలో జిల్లా కేంద్రంలోని ఐడీఓసీతో పాటు సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయాల్లో కూడా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు సంబంధిత డివిజన్ స్థాయి అధికారులు ఆయా ఆర్డీవో కార్యాలయాల్లో హాజరై ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారని తెలిపారు. జిల్లా స్థాయిలో ఐడీఓసీతో పాటు హుస్నాబాద్, సిద్దిపేట, గజ్వేల్ ఆర్డీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం జరుగనున్నందున ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ డివిజన్కు సంబంధించిన కార్యాలయంలోనే అర్జీలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..