
కర్నూలు, , 04 మే (హి.స.)
కర్నూలు, డోన్, పత్తికొండ, ఆదోని సబ్ డివిజన్లలో చిన్నతరహా నీటిపారుదల శాఖ (మైనర్ ఇరిగేషన్) పర్యవేక్షణలో 100 ఎకరాల ఆయకట్టు పైబడిన చెరువులు 60, వంద ఎకరాలులోపు ఆయకట్టు ఉన్న చెరువులు 250, పీఆర్ చెరువులు కలిపి 310 చెరువులు ఉన్నాయి. వాటిలో నీటి నిల్వ సామర్థ్యం 4.411 టీఎంసీలు (4411 ఎంసీఎఫ్టీ). 33,113 ఎకరాల ఆయకట్టు ఉంది. అత్యధిక చెరువులు శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించినవే. మరమ్మతులు, పూడిక తీత చేపట్టకపోవడం వల్ల పూడిక, పిచ్చిమొక్కలు, ముళ్లకంపలతో చెరువులు నిండిపోయాయి. చెరువులోకి వర్షపు నీరు చేరే వాగులు (ఫీడర్ ఛానల్స్), పంట కాలువలు (ఫీల్డ్ ఛానల్స్) పూడిపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. ఆ ప్రభావం భూగర్భ జలాలపై పడుతుంది. అంతేకాదు.. తూములు మరమ్మతులకు నోచుకోవడం లేదు. డ్వామా ఆధ్వర్యంలో నిర్మించిన చెక్ డ్యాంల పరిస్థితి దాదాపు ఇదే. భూగర్భ జలాలు (గ్రౌండ్ వాటర్) విభాగం అధికారులు ఇచ్చిన నివేదిక పరిశీలిస్తే కోసిగి మండలంలో ప్రమాదకర స్థాయికి భూగర్భ జలాలు పడిపోయాయి.
ఈ ఏడాది మార్చి భూగర్భ జలాలు పరిశీలిస్తే, కోసిగి మండలంలో భూ మట్టం నుంచి 20 మీటర్లు కంటే దిగువ (లోతు)కు పడిపోవడం, రాష్ట్రంలోనే ప్రమాదకర పరస్థితి అని నిపుణులు అంటున్నారు. పశ్చిమ ప్రాంతంలో మెజార్టీ గ్రామాల్లో ఈ పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో భూగర్భ జలాల సంరక్షణే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ‘జలధార.. జల సంరక్షణ పథకం’ అమలుకు శ్రీకారం చుట్టింది. ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకొని కూలీలు ద్వారా చెరువుల్లో పూడిక తీత వంటి మట్టి పనులకు ప్రాధాన్యత ఇస్తూ వంద రోజుల ప్రణాళిక సిద్ధం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV