రాష్ట్రంలో భారీగా ముడి ఇనుప ఖనిజం నిల్వలు
రాష్ట్రంలో భారీగా ముడి ఇనుప ఖనిజం నిల్వలు
రాష్ట్రంలో భారీగా ముడి ఇనుప ఖనిజం నిల్వలు


అమరావతి, 06 మే (హి.స.) రాష్ట్రంలో భారీగా ఇనుప ఖనిజం నిల్వలు ఉన్నట్లు గనుల శాఖ నిర్ధారించింది. రాష్ట్రాన్ని స్టీల్ హబ్గా మార్చేలా 17 బ్లాక్ల పరిధిలో 2.40 లక్షల కోట్ల విలువైన 2,700 మిలియన్ టన్నుల నిల్వలున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు సచివాలయంలో గనుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సందర్భంగా కీలక నివేదికను సమర్పించింది.

ఓబుళాపురం, మించేరి, గుటుపల్లి, వె ల్దుర్తి, కొణిజేడు, లక్ష్మక్కపల్లె (2 బ్లాక్లు), అద్దంకివారిపాలెం, వాడేపల్లి, లేటపల్లె, నాగయ్యపల్లె, పగడాలపల్లె, మిన్నయ్యగారిపల్లె, లక్కంవాండ్లపల్లె, శివపురం, సడుకొండ, ఎర్రకొండ ప్రాంతాల్లో ఐరన్ఓర్ బ్లాక్లను గుర్తించారు. ఇందులో కొణిజేడులో 1307 హెక్టార్లలో ఉన్న ఐరన్ఓర్ ఏపీఎండీసీ లీజులో ఉంది. లక్ష్మక్కపల్లెలోని రెండు బ్లాక్లు, అద్దంకివారిపాలెంలోని ఒక బ్లాక్ జేఎస్డబ్ల్యూ కంపెనీ లీజులో ఉంది. వాడేపల్లె-535హెక్టార్లు, లేటపల్లె-1,000 హెక్టార్లు, నాగయ్యపల్లె-239 హెక్టార్లు, పగడాలపల్లె-227 హెక్టార్లు, లక్కంవాండ్లపల్లె 300 హెక్టార్లలో ఉన్న ఐరన్ఓర్ లీజులు ఇంకా ఎవ్వరికీ కేటాయించలేదు. ఇందులో ఓబుళాపురంలో 190 హెక్టార్లలో ఉన్న లీజులు వివాదంలో ఉన్నాయి. మొత్తంగా 13 వేల హెక్టార్ల పరిధిలో ఇనుప ఖనిజం నిక్షేపాలున్నట్లు గనులశాఖ స్పష్టత ఇచ్చింది.

అన్ని చోట్ల మైనింగ్ మొదలైతే ఏటా కనీసం 110 మెట్రిక్ టన్నుల మేర ఇనుప ఖనిజం బయటకు తీయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అయితే, ఇందులో 80 శాతం బ్లాక్లు రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నాయి. ఇక్కడ మైనింగ్ చేయాలంటే, ఆ మేరకు సమానమైన భూమిని అటవీశాఖకు కేటాయించాల్సి ఉంది. ఈ విషయంలో విధాన నిర్ణయాలు తీసుకోవాలని గనులశాఖ కోరింది. గుర్తించిన 17 బ్లాక్ల్లో మైనింగ్ మొదలయితే రాష్ట్రంలో కనీసం రూ. 1.90 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. 1.50 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని నివేదించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande