
సత్యవేడు, 06 మే (హి.స.)
ముఖ్యమంత్రి చంద్రబాబు, నేను ప్రభుత్వ పర్యటనలకు మా సొంత వాహనాలనే వినియోగిస్తున్నాం. వ్యక్తిగత విదేశీ పర్యటనలకు కూడా మా సొంత డబ్బునే ఖర్చు చేస్తున్నాం. మేము ప్రజలకు, పార్టీకి పూర్తి జవాబుదారీగా ఉంటున్నాం. కానీ ప్రత్యర్థులు పనిగట్టుకుని మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ఫేక్ ప్రచారాన్ని వాస్తవ సమాచారంతో కార్యకర్తలు తక్షణమే తిప్పికొట్టాలి అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. పార్టీ కేడర్ అత్యంత అప్రమత్తంగా ఉంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు.
తిరుపతి జిల్లా సత్యవేడు పరిధిలోని శ్రీసిటీ పారిశ్రామికవాడలో గ్లోబల్ దిగ్గజ సంస్థ ‘క్యారియర్’ (Carrier Global) ఏసీల తయారీ కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమంలో లోకేష్ పాల్గొని, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాయకులు, కార్యకర్తలు అహంకారం ప్రదర్శించకుండా ప్రజలతో మమేకమవ్వాలని సూచించారు. గత ఎన్నికల్లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోవడానికి గొడ్డలి పార్టీ వారి అహంకారమే కారణం. మనం ఆ తప్పు చేయకూడదు. అహంకారం వీడి, సత్ప్రవర్తనతో, మంచి మాటలతో ప్రజల మనసులు గెలవాలి. అప్పుడు ప్రజలే మనల్ని మళ్లీ మళ్లీ గెలిపిస్తారు అని హితవు పలికారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని లోకేష్ అన్నారు. దేశంలోనే రూ.4 వేల పింఛను ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. 'తల్లికి వందనం' కింద విద్యార్థులకు రూ.15 వేలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. పోలవరం పూర్తికావొస్తోంది, అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ కొనసాగింపు రాష్ట్రానికి చాలా అవసరం అని ఆయన వివరించారు.
పార్టీలో పనితీరే కొలమానమని, ప్రతి నాయకుడి పనితీరును అధినేత చంద్రబాబు ప్రతి మూడు నెలలకోసారి సమీక్షిస్తారని లోకేష్ హెచ్చరించారు. పనిచేయని వారి పదవులు ఊడతాయని చంద్రబాబు గారు మాతో నిర్మొహమాటంగా చెప్పారు. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకుని పనిచేయాలి. పార్టీలో ఇప్పుడు కోటరీలు లేవు. సామాన్య కార్యకర్త సైతం నేరుగా అధినేతను కలిసే అవకాశం ఉంది అని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV