అతిపెద్ద ఏసీల తయారీ కేంద్రం.. శ్రీసిటీలో ‘క్యారియర్’ పరిశ్రమకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన
అతిపెద్ద ఏసీల తయారీ కేంద్రం.. శ్రీసిటీలో ‘క్యారియర్’ పరిశ్రమకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన
minister-lokesh-lays-foundation-stone-for-carrier-industry-in-sri-city-the-larg


తిరుపతి, 06 మే (హి.స.)ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతిలో మరో కీలక అడుగు పడింది. తిరుపతి జిల్లా సత్యవేడు పరిధిలోని శ్రీసిటీ పారిశ్రామికవాడలో గ్లోబల్ దిగ్గజ సంస్థ ‘క్యారియర్’ (Carrier Global) ఏసీల తయారీ కేంద్రానికి రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం లాంఛనంగా శంకుస్థాపన చేశారు. గ్లోబల్ దిగ్గజం ఏపీకి రావడం ఎంతో ఆనందదాయకమని ఈ సందర్భంగా మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

అధికారుల సమాచారం ప్రకారం.. శ్రీసిటీ పరిధిలోని ఆరూరు వద్ద 40 ఎకరాల్లో సుమారు రూ. 1000 కోట్ల భారీ పెట్టుబడితో క్యారియర్ సంస్థ ఈ అత్యాధునిక తయారీ యూనిట్ను నెలకొల్పుతోంది. ఈ బృహత్తర ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా వెయ్యి మందికి, పరోక్షంగా మరో రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇళ్లు, కార్యాలయాల్లో వినియోగించే 1, 2 టన్నుల ఏసీలతో పాటు, డేటా సెంటర్లు, భారీ పారిశ్రామిక సముదాయాలకు అవసరమైన 1000 నుంచి 5000 టన్నుల సామర్థ్యం గల భారీ కూలింగ్ సిస్టమ్స్ను ఇక్కడ తయారు చేయనున్నారు.

మౌలిక సదుపాయాలు, పోర్ట్ ఆధారిత లాజిస్టిక్స్ సేవల అనుకూలతతో శ్రీసిటీ దేశంలోనే అతిపెద్ద ఏసీల తయారీ హబ్గా (HVAC & R) అవతరిస్తోంది. ఇప్పటికే ఇక్కడ డైకిన్, ఎల్జీ, బ్లూస్టార్, హ్యావెల్స్ వంటి ప్రముఖ సంస్థలతో పాటు మొత్తం 32 విడి భాగాల సరఫరా కంపెనీలు కొలువుదీరాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తయారయ్యే ఏసీల్లో దాదాపు 40 శాతం శ్రీసిటీలోనే ఉత్పత్తి అవుతుండటం విశేషం. తాజాగా క్యారియర్ రాకతో పాటు, ఉన్న కంపెనీల విస్తరణతో 2028 నాటికి ఈ ఉత్పత్తి వాటా ఏకంగా 70 శాతానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande